ఉద్యోగం లేకున్నా రిటర్నులు దాఖలు చేయాలా? | Should be or not the job to file returns? | Sakshi
Sakshi News home page

ఉద్యోగం లేకున్నా రిటర్నులు దాఖలు చేయాలా?

Published Mon, Aug 4 2014 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

ఏడాది క్రితం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను.

 ఏడాది క్రితం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే కొంత మొత్తాన్ని ఈ ఫండ్ నుంచి ఉపసంహరించుకున్నాను. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాది కాలానికి మించి ఇన్వెస్ట్ చేస్తే, వాటిపై వచ్చే రాబడులపై ఎలాంటి పన్ను ఉండదని మిత్రులు చెపుతున్నారు. అయితే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ నుంచి వచ్చే రాబడులపై కూడా పన్ను మినహాయింపు లభిస్తుందా?             - శేఖర్, అనంతపురం
 బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ కేటగిరీ కిందకు వస్తాయి. వీటిల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకూ ఈక్విటీల్లో  పెట్టుబడులు పెడతారు. ఈక్విటీ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నియమాలు వర్తిస్తాయో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌కు కూడా అలాంటి పన్ను నియమాలే వర్తిస్తాయి. మీ విషయానికొస్తే, ఒక ఏడాది తర్వాత మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏడాది కాలం కంటే ముందే మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే మాత్రం 15 శాతం చొప్పున స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.., ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)కు సెక్షన్ 80 సీ ప్రకారం, పన్ను మినహాయింపు ఉంది. మూడేళ్ల లాకిన్ పీరియడ్ కాలానికి రూ.లక్ష వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులను రూ.లక్షన్నరకు పెంచారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈఎల్‌ఎస్‌ఎస్‌లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం పన్ను మినహాయింపు పొందవచ్చా? అలా కుదరని పక్షంలో పన్ను మినహాయింపు పొందడానికి ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు.    - సుజాత, హైదరాబాద్
 పన్ను ఆదా చేసే మార్గాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సి కింద ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్‌ఎస్‌ఎస్)లకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపులను రూ. లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రభుత్వం పెంచింది. ఈ సెక్షన్ కింద పూర్తిగా రూ. లక్షన్నర పన్ను మినహాయింపు పొందాలంటే, రూ. లక్షన్నర మొత్తం ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు.

 నాకు, నా భార్యకు  ఎన్‌పీఎస్ టైర్-వన్ అకౌంట్లు ఉన్నాయి. ప్రతీఏటా ఈ అకౌంట్లలో కొంత మొత్తం జమ చేస్తూ ఉన్నాము. అయితే మేం పనిచేసే కంపెనీ ఈ అకౌంట్లలో ఎలాంటి మొత్తాన్ని జమ చేయడం లేదు. ఆదాయపు పన్ను చట్టం కింద మేం ఈ అకౌంట్ ద్వారా ఏమైనా పన్ను మినహాయింపులు, తగ్గింపులు గానీ పొందొచ్చా?  - పరమేశ్, జగిత్యాల
 మీరు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నవారై, మీ కంపెనీ తరపు నుంచి మీ అకౌంట్లలో ఏ మాత్రం సొమ్ములు జమ కాని పక్షంలో,  సెక్షన్ 80 సీసీడీ(1) కింద మీరు పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. మీ వేతనం(బేసిక్, డీఏలతో కలుపుకొని)లో 10 శాతం వరకూ పన్ను తగ్గింపు పొందవచ్చు. దీనికి పరిమితి రూ. 1లక్ష వరకూ ఉంది.
 నా భార్యకు కొడుకు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేసింది. అంతకు ముందు ఆమె తాను సంపాదించిన ఆదాయంతో సొంతంగా పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు కూడా దాఖలు చేసేది.ఇప్పుడు ఉద్యోగం లేనందున ఎలాంటి వేతనం ఆమె పొందడం లేదు. అయితే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆమె కొంత మొత్తం (చాలా తక్కువగా రూ.5,000 లోపు) ఆదాయం పొందుతోంది. ఆమె ఆదాయపు పన్ను రిట ర్న్‌లు దాఖలు చేయాలనుకుంటున్నాను. అయితే ఐటీఆర్-2 ద్వారా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాలా? లేకుంటే ఆమె ఆదాయాన్ని నా ఆదాయంతో కలిపి నా ఐటీ రిటర్న్‌లో చూపిస్తే సరిపోతుందా? - సయ్యద్ రిజ్వి, హైదరాబాద్
 తప్పనిసరి కాకపోయినప్పటికీ, మీ భార్య ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు. ఐటీఆర్-2 ద్వారా ఆమె ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు. ఆమె తన సొంత సంపాదన ద్వారా ఆర్జించిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి, క్యాపిటల్ గెయిన్స్ పొందుతున్న పక్షంలో సొంతంగా ట్యాక్స్ రిటర్న్‌లు దాఖలు చేయడమే ఉత్తమం. ఒకవేళ పన్ను భారాన్ని తగ్గించుకునే నిమిత్తం మీరు ఆమె పేరు మీద ఇన్వెస్ట్  చేయడం సరికాదు. ఈ విషయం ఆదాయపు పన్ను అధికారుల దృష్టికి వస్తే, మీకు సమస్యలు తప్పవు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement