జీఎస్టీ.. చప్పట్లు తప్ప చేసేదేముంది?
న్యూఢిల్లీ: ఒకవైపు దేశమంతా ఒకే పన్ను విధానమంటూ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీ నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రాబోతుంది. మరోవైపు ఈ విధానాన్ని ప్రతిపక్షాలే కాదు దేశ ప్రజలు స్వాగతించడం లేదని నేతల నుంచి నూతన పన్ను విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ విధానం అనేది ఎవరికీ ఆమోదయోగ్యం కాని నల్ల చట్టమని రాజ్యసభ సభ్యుడు, సమాజ్ వాదీ పార్టీ నేత నరేశ్ అగ్రవాల్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదంతో సంబంధం లేకుండా మీడియా అయితే కచ్చితంగా ఈ సమావేశానికి హాజరవుతుందన్నారు. కేవలం జీఎస్టీ వ్యతిరేఖ వైఖరిని మాత్రమే తాము అవలంభిస్తున్నామని, అయితే కొత్త వివాదాలను తెరపైకి తేవడం తమ ఉద్దేశం కాదని ఎస్పీ ఎంపీ పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ ఆర్థికశాఖ మంత్రి అమిత్ మిత్రా నూతనంగా అమల్లోకి రానున్న ఏకపన్ను విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడికి వచ్చి కూర్చుని చప్పట్లు కొట్టడం తప్ప.. చేయాల్సిందేమీ లేదన్నారు. జీఎస్టీ విధానంపై దేశంలో మెజార్టీ ప్రజలు మొగ్గుచూపడం లేదని తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు మాత్రమే ఏక పన్ను విధానాన్ని స్వాగతించారని, అయితే దీన్ని మొత్తం దేశంపై రుద్దుతున్నారని విమర్శించారు.
కాగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా లాంచ్ కాబోతున్న జీఎస్టీ వేడుకకు, ప్రతిపక్షాలన్నీ దాదాపు బాయ్ కాట్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే జీఎస్టీ వేడుకకు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు హాజరుకావాలని సమాచార, ప్రసారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ వేడుకను బాయ్ కాట్ చేయడం సరియైనది కాదని నాయుడు పేర్కొన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం ఈవెంట్‌కు హాజరయ్యేలా కనిపించడం లేదని తెలుస్తోంది.