
సియాం కొత్త ప్రెసిడెంట్ వినోద్ దాసరి
- వైస్-ప్రెసిడెంట్‌గా జనరల్ మోటార్స్ ఎండీ అర్వింద్ సక్సేనా
న్యూఢిల్లీ: సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియాం) కొత్త ప్రెసిడెంట్‌గా అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ దాసరి ఎన్నికయ్యారు. కొత్త వైస్-ప్రెసిడెంట్‌గా జనరల్ మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ అర్వింద్ సక్సేనా, కొత్త కోశాధికారిగా మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ ఎన్నికయ్యారు. వాహన పరిశ్రమ మెరుగుదలకు తగిన కృషి చేస్తానని ఈ సందర్భంగా వినోద్ దాసరి పేర్కొన్నారు. జాతి పట్ల సియాం సంస్థకున్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పాడతానని చెప్పారు. వాహన కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే దేశంలోనే అతిపెద్ద సంస్థ సియాం, పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుంది. వాహన పరిశ్రమకు సంబంధించి నియమ, నిబంధనలను, విధానాల రూపకల్పనలో సంబంధిత వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తుంది.