షేర్లలాంటి రిస్క్ ఎక్కువుండే అసెట్స్‌పై మదుపరులు బేరిష్‌గా ఉంటారని, దీంతో మార్కెట్లలో, ఎకానమీలో రికవరీ చాలా మందకొడిగా వస్తుందని బోఫాఎంఎల్ అంచనా వేసింది. కరోనా వైరస్ మరోదఫా ఉధృతి చూపే రిస్కులున్నందున ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉంటారని బోఫా సర్వేలో తేలింది. మార్చి కనిష్ఠాల నుంచి ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్లు కూడా కొంతమేర కోలుకున్న సంగతి తెలిసిందే. ఎకానమీలో రికవరీ వేగంగా ఉంటుందన్న అంచనాలు ఈ పుల్‌బ్యాక్‌కు దోహదం చేశాయి. కానీ తాజాగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతూనే ఉండడం, ఆంక్షలు సడలిస్తే సంక్షోభం ముదరడం వంటివి ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లుజల్లాయి. కరోనా సెకండ్‌వేవ్ వస్తుందన్న భయమే అతిపెద్ద రిస్కని సర్వేలో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
సంక్షోభానంతరం U ఆకారపు లేదా W రికవరీ ఉంటుందని సర్వేలో 75 శాతం మంది అంచనా వేయగా, కేవలం 10 శాతం మంది మాత్రమే V ఆకార రికవరీకి ఛాన్సులున్నాయని భావించారు. మిగిలినవాళ్లు ఎటూ చెప్పలేమన్నారు. రికవరీలో మందగమనం, లేదా వృద్ధి కొంత పురోగమించి తిరిగి నేలచూపులు చూసి అనంతరం రికవరీ చెందడాన్ని వరుసగా యూ, డబ్ల్యు ఆకార రికవరీలంటారు. సంక్షోభ నేపథ్యంలో ప్రజల వద్ద నగదు నిల్వలు 5.7 శాతానికి ఎగబాకినట్లు సర్వేలో తేలింది. ఇన్వెస్టర్లు హడావుడిగా పెట్టుబడులు పెట్టేకన్నా నగదు చేతిలో ఉంచుకొని వేచిచూసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని బోఫా పేర్కొంది. ఈ సర్వే యూఎస్ మార్కెట్లను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని చేసినా, ఫలితాలు అన్ని దేశాలకు వర్తించేలా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment