
స్మార్ట్ రాన్ నుంచి టి-ఫోన్
♦ ఆవిష్కరించిన సచిన్, కేటీఆర్
♦ స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,999
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ స్మార్ట్‌రాన్ టి-ఫోన్ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను గురువారమిక్కడ ప్రవేశ పెట్టింది. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా ఈ ఫోన్‌ను విడుదల చేసింది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 64 బిట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 అక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీని దీనికి పొందుపరిచారు. 4జీ, డ్యూయల్ ఫ్లాష్‌తో 13 ఎంపీ కెమెరా, 4 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డీటీఎస్ ప్రీమియం సౌండ్, డ్యూయల్ సిమ్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సి చార్జర్ ఇతర ఫీచర్లు. వెలుతురులో డిస్‌ప్లే స్పష్టత కోసం అపికల్ అసెర్టివ్ టెక్నాలజీని వాడారు. ధర రూ.22,999. నాలుగు రంగుల్లో లభిస్తుంది. జూన్ నుంచి స్మార్ట్‌రాన్ టి-స్టోర్, గ్యాడ్జెట్360.కామ్‌లో కొనుక్కోవచ్చు.
ఏటా ఒక మోడల్..: స్మార్ట్‌రాన్ ఇటీవలే ఇక్కడి గచ్చిబౌలిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తయారీ కేంద్రాన్ని సైతం నెలకొల్పాల్సిందిగా ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. 14 అంగుళాల అల్ట్రాబుక్, 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర యాక్సెసరీస్‌ను కొద్ది రోజుల్లో ప్రవేశపెడతామని కంపెనీ వ్యవస్థాపకులు మహేష్ లింగారెడ్డి వెల్లడించారు. ఏటా ఒక ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే టీ-బుక్ పేరుతో అల్ట్రాబుక్‌ను ప్రవేశపెట్టామన్నారు. ‘ప్రస్తుతం ఫాక్స్‌కాన్‌కు చెందిన విదేశీ ప్లాంట్లలో తయారు చేసి ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లో ఫాక్స్‌కాన్ భారత ప్లాంట్లలో తయారు చేయిస్తాం. రెండు మూడేళ్లలో సొంత ప్లాంటు పెట్టాలన్న ఆలోచన ఉంది. పరిశోధన, అభివృద్ధికి రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేశాం’ అని పేర్కొన్నారు.
సవాళ్లుంటేనే ఫన్..: స్మార్ట్‌రాన్‌లో సచిన్ సైతం పెట్టుబడులు పెట్టారు. టి-ఫోన్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సవాళ్లు లేకుంటే జీవితంలో ఫన్ ఉండదని అన్నారు. సవాళ్ల నుంచి వచ్చిన విజయమే మరింత తీయగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ‘నేను యవ్వనంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లు లేవు. ల్యాండ్‌లైన్ ముందు కుటుంబ సభ్యులందరూ కూర్చుని మాట్లాడేవారు. ఇప్పుడు అందరి చేతిలోనూ మొబైల్ ఉంటోంది. అందరూ అందుబాటులో ఉంటున్నారు. నా కుమారుడు అర్జున్ కి ఆరేళ్ల వయసు వచ్చే దాకా అతనితో మొబైల్‌లో మాట్లాడలేదు. స్మార్ట్‌రాన్ విషయంలో సరైన కంపెనీనే ఎంచుకున్నందుకు గర్వంగా ఉంది’ అన్నారు.