సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ప్రతి పౌరుడికి 12 అంకెలు కలిగిన ప్రత్యేక గుర్తింపు నెంబరు గల ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం సమంజసమా? కాదా? అసలు ఇది చట్టం ముందు చెల్లుతుందా, లేదా? ఆధార్ కార్డును బలవంతంగా పౌరులకు అంటగట్టడం పౌరుడి ప్రాథమిక హక్కులకు విరుద్ధమా, కాదా? ముఖ్యంగా పౌరుల ప్రైవసీని దెబ్బతీయడం కాదా? ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ కార్డును ముడిపెట్టడంలో అర్థం ఉందా? కార్డు లేదన్న కారణంగా ప్రభుత్వ స్కీమ్‌లు వర్తించవని చెప్పడం ఎంత వరకు సమంజం? ఆధార్ పేరుతో పౌరులపై ప్రభుత్వాల నిఘా కొనసాగించడం సబబేనా? తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసన బెంచీ బుధవారం విచారణ ప్రారంభించింది.
ఆధార్ కార్డుకు వ్యతిరేకంగా తొలి పిటిషన్ దాఖలైన ఐదేళ్ల తర్వాత ఈ విచారణ ప్రారంభమైంది. ఇంతకుముందు ఈ కేసును సాధారణ బెంచీ విచారించి ఎటూ తేల్చలేక రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించిన విషయం తెల్సిందే. అసలు ఆధార్ కార్డు ఏమిటీ? 2009లో ఈ ఆధార్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఆధార్ ఫ్లాట్ ఫారమ్‌పై పౌరులు 12 అంకెలు కలిగిన ప్రత్యేక నెంబరును తీసుకోవాలి. ఈ సందర్భంగా వేలు ముద్రలు, నేత్ర ఆనవాళ్లు లాంటి బయోమెట్రిక్ వివరాలతోపాటు ఏ నగరం, ఏ వాడ, ఏ ఇంటిలో ఉండేది? తదితర డెమోగ్రాఫిక్ వివరాలను తప్పనిసరి అందజేయాలి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయడం కోసం ఆధార్ కార్డును తీసుకొచ్చామని, ఈ కార్డును తీసుకోవడం తప్పనిసరేమీ కాదని, ఐశ్చికం అంటూ కేంద్రం మొదట్లో చెబుతూ వచ్చింది. ఏ గుర్తింపులేని పౌరుడికి ఇది ఒక గుర్తింపు కార్డుగా కూడా ఉంటుందని చెప్పింది.
రేషన్ బియ్యంతో మొదలుకొని అన్ని ప్రభుత్వ స్కీమ్‌లకు ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ వచ్చాయి కేంద్రంలోని నాటి కాంగ్రెస్, నేటి బీజేపీ ప్రభుత్వాలు. ఆ తర్వాత పాన్ కార్డుకు, ఫోన్ నెంబర్‌కు, బ్యాంక్ అకౌంట్‌కు, పీఎఫ్ నెంబర్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ వచ్చాయి. జార్ఖండ్‌లో, యూపీలో ఆధార్ లేకపోవడం వల్ల రేషన్ బియ్యం ఇవ్వక పోవడంతో ఎనిమిదేళ్ల పిల్ల, ఓ వద్ధుడు మరణించడం లాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోనైతే ఆధార్ కార్డు లేని కారణంగా వలస కార్మికుల పిల్లలను బడిలోకి అనుమతించలేదు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడం కోసం తీసుకొచ్చిన ఆధార్ స్కీమ్ పేదల పొట్టగొట్టడం ఎంత దారుణం? హెచ్‌ఐవీ రోగులకు ఆస్పత్రుల్లో చికిత్సలు నిలిపివేయడం ఎంత ఘోరం?
పైగా మన ఆధార్ కార్డులకు సరైన భద్రత లేదన్న విషయం మొదటి నుంచి తెలుస్తున్నదే. కేవలం ఐదు వందల రూపాయలకు ఆధార్ డేటా బజార్‌లో దొరుకుతోందన్న విషయాన్ని ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక బయట పెట్టిన విషయం తెల్సిందే. భగవంతుడు హనుమంతుడి పేరుతోనే కాకుండా కోడి, కుక్క పేరుతో కూడా ఆధార్ కార్డులు పుట్టుకొచ్చి విస్తుగొలిపిన విషయం విదితమే! అలాంటప్పుడు ఒకరి ఆధార్ కార్డును మరొకరి కార్డుగా మార్చడం ఎంత సేపు. దానివల్ల ఎంతటి తీవ్ర విపత్తులు ఉంటాయో మున్ముందు అనుభవంలోకి రావచ్చు. ఆధార్ కార్డు గోప్యతను రక్షించేందుకు పౌరుడికి ఎప్పటికప్పుడు తాత్కాలిక నెంబర్ కేటాయించే పద్ధతిని తీసుకొస్తామని కేంద్రం కొత్తగా చెబుతోంది.
ఏ చట్టం భద్రత లేకుండా తీసుకొచ్చిన ఆధార్ స్కీమ్‌కు ఏడేళ్ల తర్వాత అంటే, 2016లో ఆధార్ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. రాజ్యసభ ఆమోదం అవసరం లేకుండా చూసేందుకు లోక్‌సభలో ఆర్థిక బిల్లుగా ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదం పొందింది. కొత్తగా తాత్కాలిక నెంబర్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తోందో? అది ఎంత భద్రంగా ఉంటుందో, ఎలాంటి కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయో ఇప్పటికి చిక్కు ప్రశ్నలే. వీటన్నింటికి సుప్రీం కోర్టు సమాధానం చెప్పాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment