ట్రూ బ్యాలెన్స్ యాప్లో సాఫ్ట్బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్
సాఫ్ట్ నిధులతో వేగంగా విస్తరిస్తాం: ట్రూ బ్యాలెన్స్
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన మొబైల్ బ్యాలెన్స్ చెకింగ్ యాప్, ట్రూ బ్యాలెన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ, సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా పెట్టుబడులు పెట్టింది. ప్రి పెయిడ్ మొబైల్ అకౌంట్లలో లభ్యమయ్యే బ్యాలెన్స్‌ను, కాల్ లాగ్‌ను, డేటా ప్యాక్ అసెస్‌మెంట్‌ను, రీచార్జ్ సర్వీసులను ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ట్రూ బ్యాలెన్స్ యాప్ తెలియజేస్తుంది. సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది వెల్లడి కాలేదు.
కోటి డౌన్‌లోడ్‌లు లక్ష్యం..
2014లో చార్లీ లీ ఈ యాప్‌ను ప్రారంభించారు. ఈ సాఫ్ట్‌బ్యాంక్ నిధులతో విస్తరణను మరింత వేగవంతం చేస్తామని, తమ సేవలను మరింతగా మెరుగుపరుస్తామని లీ తెలిపారు. భారత్‌లో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లకు చేరువ కావాలన్న తమ ప్రయాణం ఇప్పడే ప్రారంభమైందని, సాఫ్ట్‌బ్యాంక్ వెంచర్స్ కొరియా పెట్టుబడులతో ఈ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే 20 లక్షల మంది తమ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని, మరో 9 నెలల్లో కోటి డౌన్‌లోడ్‌ల మైలురాయిని చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.