
టోక్యో: అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనల కారణంగా పెట్టుబడుల విలువ కరిగిపోవడంతో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 23.4 బిలియన్ డాలర్ల భారీ నష్టం నమోదు చేసింది. గతేడాది ఇదే వ్యవధిలో 5.6 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించింది. సమీక్షాకాలంలో అమ్మకాలు 6 శాతం పెరిగి 11.6 బిలియన్ డాలర్లకు చేరాయి.
కంపెనీ ఏర్పాటైన తర్వాత నుంచి ఒక త్రైమాసికంలో ఇంత భారీ నష్టాలు ఎన్నడూ చూడలేదని సంస్థ సీఈవో మసయోషి సోన్ తెలిపారు. గత ఆరు నెలలుగా నమోదైన నష్టాలు 37 బిలియన్ డాలర్లకు ఎగిశాయని వివరించారు. చైనా ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబాలో వాటాల విలువ భారీగా పడిపోవడం .. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నష్టాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిల్చింది.
అలాగే, యెన్ విలువ పడిపోవడం కూడా మరో కారణం. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ద్రవ్యోల్బణం వంటి అంశాల కారణంగా ఈ సవాళ్లు నెలలు లేదా సంవత్సరాల తరబడి కూడా కొనసాగవచ్చని సోన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment