పనికిరారని ముద్ర వేసి.. టెకీలను పంపేస్తున్నారు
ఎవరిదైనా ఉద్యోగం తీసేయాలంటే వాళ్లను పనికి రారని ముద్ర వేయాలి. దేశంలో చాలావరకు ఐటీ కంపెనీలు ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తున్నాయి. చాలామంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను 'నాన్ పెర్ఫార్మర్స్'గా ముద్ర వేసి వాళ్లను ఇంటికి పంపేస్తున్నాయి. ఆటోమేషన్ పెరగడం, లాభాలు గణనీయంగా తగ్గడం, ట్రంప్ ప్రభావంతో అంతర్జాతీయంగా కొత్త కాంట్రాక్టుటు రాకపోవడానికి తోడు ఉన్న కాంట్రాక్టులు కూడా రెన్యువల్ కాకపోవడం లాంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్యను చాలావరకు తగ్గిస్తున్నాయి. ప్రధానంగా మిడ్, సీనియర్ లెవెల్స్‌లో ఈ ఉద్యోగాల కోత ఎక్కువగా కనపడుతోంది. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా.. ఇలా అనేక కంపెనీలు ఇటీవలి కాలంలో కొంతమందిని నాన్ పెర్ఫార్మర్లు అనే ముద్ర వేసి ఉద్యోగాలు ఊడగొట్టి పంపించాయి. ఉద్యోగుల జీతాల మీదే తాము దాదాపు 60-70 శాతం ఖర్చుపెట్టాల్సి వస్తోందని, దాన్ని తగ్గించుకోవడం తప్ప తమకు వేరే మార్గం ఉండబోదని కంపెనీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి.
పేరుకు నాన్ పెర్ఫార్మర్లు అని చూపించి పంపేస్తున్నారని, ఇలా పంపేసేవారిలో చాలామందికి ఇంతకుముందు సంవత్సరం లేదా ఈ సంవత్సరం రేటింగులు బ్రహ్మాండంగా వచ్చిన దాఖలాలు ఉన్నాయని, కేవలం అతి తక్కువ కాలంలో ఒక 'ఎ'గ్రేడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉన్నట్టుండి నాన్ పెర్ఫార్మర్‌గా ఎలా మారిపోతాడని ఇటీవలే ఉద్వాసనకు గురైన ఒక ఉద్యోగి వాపోయారు. క్వాలిటీ ఎష్యూరెన్స్ విభాగంలో సాధారణంగా నాన్ పెర్ఫార్మెన్స్ అనేదే ఉండదని, కానీ అదే కారణం చూపించి పైగా తనకేదో మేలు చేస్తున్నట్లుగా నాలుగు నెలల జీతం ఇస్తున్నామని చెప్పి, తనచేత బలవంతంగా రిజైన్ చేయించారని, తనను ఏదో మీటింగ్ ఉందని పిలిపించి అటు నుంచి అటే పంపేశారని మరో ఉద్యోగి చెప్పారు. సాధారణంగా లే ఆఫ్‌లు ప్రతియేటా ఉంటాయి గానీ ఈ ఏడాది ఇంకా ఎక్కువగా ఉన్నాయని ఒక హైరింగ్ సంస్థ నిర్వాహకుడు చెప్పారు. సీనియర్ పొజిషన్ల నుంచి బయటకు వచ్చినవారికి కూడా కొత్త సంస్థల్లో ఓపెనింగ్స్ పెద్దగా కనిపించడం లేదని, ఒకటీ అరా ఇంటర్వ్యూలు వస్తున్నా.. మళ్లీ యాజమాన్యం ఆలోచనలు మారడంతో చివరకు వాళ్లకు ఆఫర్ లెటర్లు రిలీజ్ కావడం లేదని వివరించారు.
కొత్తగా తీసుకుంటాం: టీసీఎస్
ఒకవైపు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అంతా ఉద్యోగులను బయటకు పంపేస్తున్న ట్రెండ్ కనిపిస్తుంటే మరోవైపు టీసీఎస్ మాత్రం తమ దగ్గర అలాంటిదేమీ లేదని, పైపెచ్చు ఈసారి కొత్తగా మరింతమందిని తీసుకుంటామని ప్రకటించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. బిహార్‌లో తమ రెండో క్యాంపస్‌ను ప్రారంభించిన టీసీఎస్.. తన ప్రకటనతో నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించింది.