యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ డౌన్‌గ్రేడ్‌ | S&P Global junk rating to Axis Bank, Bajaj finance | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ డౌన్‌గ్రేడ్‌

Published Sat, Jun 27 2020 11:03 AM | Last Updated on Sat, Jun 27 2020 11:03 AM

S&P Global junk rating to Axis Bank, Bajaj finance  - Sakshi

ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తాజాగా ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ బ్లూచిప్‌ బజాజ్‌ ఫైనాన్స్‌ల రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ‘జంక్‌’ హోదాను ప్రకటించింది. తద్వారా కోవిడ్‌-19 దెబ్బతో దేశీయంగా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థలకు ఆర్థికపరమైన రిస్కులు పెరుగుతున్నట్లు అభిప్రాయపడింది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను BB+/స్థిరత్వం/Bకు సవరించింది. గతంలో BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను ఇచ్చింది. అంతేకాకుండా దుబాయ్‌ అంతర్జాతీయ ఫైనాన్షియల్‌, గిఫ్ట్‌ సిటీ, హాంకాంగ్‌ బ్రాంచీల రేటింగ్స్‌ను సైతం BBB- నుంచి తాజాగా BB+కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. బాండ్ల రేటింగ్‌ను BB కేటగిరీకి సవరిస్తే జంక్‌ స్థాయికి చేరినట్లేనని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఎకనమిక్‌ రిస్కుల నేపథ్యంలో ఆస్తుల(రుణాలు) నాణ్యత, ఆర్థిక పనితీరు నీరసించే వీలున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఈ సందర్భంగా పేర్కొంది.

పటిష్టం
దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థ సగటుతో పోలిస్తే యాక్సిస్‌ బ్యాంక్‌ రుణ నాణ్యత అత్యుత్తమమంటూ ఎస్‌అండ్‌పీ పేర్కొంది. అయితే అంతర్జాతీయ సంస్థలతో చూస్తే.. మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) అధికంగా నమోదయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. అయినప్పటికీ మార్కెట్‌ వాటాను నిలుపుకోవడంతోపాటు, తగినన్ని పెట్టుబడులతో బ్యాంక్‌ కార్యకలాపాలు కొనసాగే వీలున్నట్లు అభిప్రాయపడింది. కాగా.. ఎన్‌బీఎఫ్‌సీ.. బజాజ్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను సైతం ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ తాజాగా డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో ఇచ్చిన BBB-/ప్రతికూలం/A3 రేటింగ్‌ను  BB+/స్థిరత్వం/Bకు సవరించింది. ఈ బాటలో మరో ఎన్‌బీఎఫ్‌సీ శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను సైతం BB/ప్రతికూలం/B నుంచి BB/watch Negative/Bకు డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఇదే విధంగా ఇండియన్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను క్రెడిట్‌ వాచ్‌గా సవరించింది. రానున్న త్రైమాసికాలలో బ్యాంక్‌ క్రెడిట్‌ ప్రొఫైల్‌ బలహీనపడనున్నట్లు ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. అలహాబాద్‌ బ్యాంక్‌ విలీనంతోపాటు.. కోవిడ్‌-19 కారణంగా బ్యాంక్‌ అధిక రిస్కులను ఎదుర్కొనే అవకాశమున్నట్లు ఎస్‌అండ్‌పీ భావిస్తోంది.

కొనసాగింపు..
ఇతర బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, కొటక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌లకు గతంలో ఇచ్చిన రేటింగ్స్‌ను కొనసాగించనున్నట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ పేర్కొంది. అయితే మణప్పురం ఫైనాన్స్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. హీరో ఫిన్‌కార్ప్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ల రేటింగ్స్‌ను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement