స్టార్టప్‌ల కోసం ‘ఏంజిల్స్’ | Startaps for angels | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌ల కోసం ‘ఏంజిల్స్’

Published Sat, Nov 14 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

వినుత రాళ్లపల్లి లీడ్ ఏంజిల్స్ నెట్‌వర్క్, దక్షిణాది వైస్ ప్రెసిడెంట్

వినుత రాళ్లపల్లి లీడ్ ఏంజిల్స్ నెట్‌వర్క్, దక్షిణాది వైస్ ప్రెసిడెంట్

స్టార్టప్స్‌కు, ఇన్వెస్టర్లకు వారధిగా లీడ్ ఏంజెల్స్ నెట్‌వర్క్
* రెండేళ్లలో 10 సంస్థలకు 8-9 కోట్ల దాకా నిధులు
* సభ్యులుగా ఐదు నగరాల నుంచి 110 మంది ఇన్వెస్టర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లో లిస్టయి... పరుగులు పెడుతున్న కంపెనీకి భారీ ఎత్తున నిధులు సమీకరించడానికి డిబెంచర్లు, క్విప్ ఇష్యూ వంటి అనేక మార్గాలున్నాయి. ఇక లిస్టెడ్ కాకున్నా బాగా పేరున్న కంపెనీకైతే రుణాల రూపంలోనో, ప్రయివేటు ఈక్విటీ ఫండ్ల నుంచో నిధులు సమీకరించటం కష్టం కాదు.

మరి అప్పుడే ప్రారంభించి నిధుల్లేక పురిటి నొప్పులు పడుతున్న స్టార్టప్ సంస్థలకో..? మంచి ఐడియాతో ఆరంభించినా, దాన్ని ముందుకు తీసుకెళ్లటానికి నిధుల్లేక సతమతమవుతున్న వాటికో..? నిజమే!! వీటికి నిధులంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే సదరు కంపెనీ వాల్యుయేషన్‌పై ఇన్వెస్టర్లకు స్పష్టత ఉండదు. ఎంత పెట్టుబడికి ఎంత ఈక్విటీ ఇవ్వాలన్నది స్టార్టప్స్‌కూ అర్థం కాదు. అందుకే ఈ రెండింటికీ అలాంటి సమస్యలు తీర్చి, ఇద్దరినీ ఒక గొడుగు కిందికి  తీసుకొస్తోంది లీడ్ ఏంజిల్స్ నెట్‌వర్క్.

రెండేళ్ల కిందట ఏర్పాటయిన ఈ సంస్థ... ఇప్పటికి 10 సంస్థలకు నిధులు అందించింది. 110 మందికిపైగా ఇన్వెస్టర్లు దీన్లో సభ్యులు. రోజూ వందల సంఖ్యలో కార్పొరేట్ సంస్థలను కలుస్తూ.. వేల మంది యువత వినూత్న ఆలోచనల్ని వాటి ముందుంచటమే తమ పని అంటున్న లీడ్ ఏంజిల్స్ నెట్‌వర్క్ దక్షిణాది వైస్ ప్రెసిడెంట్ వినుత రాళ్లపల్లి... తమ సంస్థ గురించి ఏం చెబుతున్నారనేది ఆమె మాటల్లోనే...
 
కోటి రూపాయల కన్నా తక్కువ పెట్టుబడి అవసరమయ్యే స్టార్టప్‌లను గుర్తించి... వాటికి ఇన్వెస్టర్లను వెతికి పెట్టేందుకు ప్రొఫెసర్ సి.అమర్‌నాథ్, సుశాంతో మిత్రా కలిసి 2013 అక్టోబర్లో దీన్ని ఆరంభించారు. స్టార్టప్‌లు పెట్టాలనుకునే వాళ్ల ైవె పు, పెట్టుబడిదారుల వైపు ఉన్న సమస్యలను తగ్గిస్తూ.. పెట్టుబడులు సులువుగా, వేగంగా అందేలా చేయటం మా ఉద్దేశం. ఇది నిజంగా కత్తిమీద సామే. కాస్త తేడా వచ్చినా రెండు వైపులా ఇబ్బందులొస్తాయి.
 
5 నగరాలు.. 110 మంది ఇన్వెస్టర్లు..
ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్ నగరాల్లోని 110 మంది వ్యకితగత పెట్టుబడిదారులతో కలిసి లీడ్ ఏంజిల్స్ పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్ డెరైక్టర్ అబా జోల్, బ్యాంక్ ఆఫ్ టోక్యో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ టాండన్, స్టార్ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ ఆదిత్య, మైసేతు ఫౌండర్ అమిత్ పటేల్, ఎస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ సింఘి, ఓలా డెరైక్టర్ నితేష్ ప్రకాశ్, బ్లూ చిప్ కంప్యూటర్స్ సీఈఓ రాజేష్ కొఠారి వంటివారు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 నెలల క్రితం ప్రారంభమైన హైదరాబాద్ నుంచి 20 మంది సభ్యులు ఉన్నారు.
 
ఏం చేస్తుందంటే..
నిధులవసరమైన స్టార్టప్‌లు తొలుత తమ బిజినెస్ ప్లాన్‌ను లీడ్ ఏంజెల్స్‌కు పంపాలి. ప్రతి నెలా మొదటి శుక్రవారం ఆయా ప్రాంతం ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వహిస్తాం. ఇందులో స్టార్టప్స్ తమ ఆలోచనలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజెంటేషన్ ఇస్తారు. ఆసక్తి ఉన్న ఇన్వెస్టర్లు ముందుకొస్తారు. అయితే ఒక నగరంలోని పెట్టుబడిదారులు ఇతర నగరంలోని స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఆ మీటింగ్‌లను వీడియో తీసి నెట్‌వర్క్ మెంబర్స్‌కు పంపిస్తాం.
 
లీడ్ ఏంజెల్స్‌కు లాభమేంటంటే..
స్టార్‌‌టప్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ముందుగా మా వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకు వ్యక్తిగత ఇన్వెస్టర్లయితే ఏడాదికి రూ.60 వేలు, సంస్థలైతే ఏడాదికి రూ.1.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 10 కంపెనీలకు.. రూ.8-9 కోట్ల పెట్టుబడులందేలా చేశాం. ఇందులో మైల్యాబ్ యోగి, మైకట్ ఆఫీస్, గ్రేమీటర్, సెన్సస్ టెక్నాలజీస్, థ్రిల్లోఫీలియా, ఆన్‌లైన్ ప్రసాద్, గేమ్ ఎక్సెస్ వంటివి ఉన్నాయి. నిధుల సమీకరణ కోసం రోజూ 30-40 దరఖాస్తులొస్తుంటాయి. రెండేళ్లలో 200 మంది మెంబర్స్‌ను సంస్థలో రిజిస్టర్ చేయించాలని, ఏడాదికి కనీసం 12 సంస్థలకు నిధులందించాలన్నది లక్ష్యం.
 
ఇలాగైతేనే పెట్టుబడులొస్తాయ్..
లీడ్ ఏంజెల్స్ పని కేవలం నిధులందేలా చేయడం మాత్రమే కాదు. ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఏ మార్పులైతే బాగుంటుందో కూడా స్టార్టప్‌లకు సూచిస్తాం. ఏ స్టార్టప్‌కైనా తమ ఆలోచనని చెప్పడం, అది ఎంత వేగంగా విస్తరిస్తుందో వెల్లడించడం, అనుబంధ రంగాల్లోకి ఎలా చొచ్చుకుపోగలదో వివరించడమనేవి చాలా ముఖ్యం.

వ్యాపార ఆలోచనలో కొత్తదనం, బృంద సభ్యుల సృజన, క ష్టపడేతత్వం, ప్రణాళికను అమలుపరిచే తీరు, దాన్ని మెరుగుపరిచే తపన, నెట్‌వర్క్‌ని విస్తరించడం, పోటీని తట్టుకొనే ధైర్యం ఈ ఆరూ ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇన్వెస్టర్లను ఎలా ఒప్పించాలో కూడా తెలిస్తేనే నిధులు త్వరగా వస్తాయి.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement