బడ్జెట్‌కు ముందు ర్యాలీ చాన్స్ | Stock market may see pre-Budget rally this week on reform | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌కు ముందు ర్యాలీ చాన్స్

Published Mon, Jun 30 2014 2:43 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

బడ్జెట్‌కు ముందు ర్యాలీ చాన్స్ - Sakshi

బడ్జెట్‌కు ముందు ర్యాలీ చాన్స్

  • మార్కెట్ కదలికలపై స్టాక్ నిపుణుల అంచనా  బుల్ ట్రెండ్‌కు అవకాశం
  • సంస్కరణల అంచనాలతో కొనుగోళ్ల దూకుడు  సెన్సెక్స్ 500 పాయింట్ల వరకూ పెరగవచ్చు
  • న్యూఢిల్లీ: సంస్కరణలు, బడ్జెట్‌పై ఆశలతో ఈ వారం స్టాక్ మార్కెట్లలో ర్యాలీ వచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహాన్నిచ్చే పటిష్ట ప్రతిపాదనలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో ఈ వారం మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడతాయని పేర్కొన్నారు. సంస్కరణలతో కూడిన చర్యలపై అంచనాలతో ప్రధాన సూచీలు లాభాలతో దూసుకెళతాయని అభిప్రాయపడ్డారు. ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 400 నుంచి 500 పాయింట్ల వరకూ పుంజుకునే అవకాశమున్నదని చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం 150 పాయింట్లు లాభపడవచ్చునని పేర్కొన్నారు.
     
    జూలై 10న బడ్జెట్
    ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే నెల 10న లోక్‌సభలో వార్షిక సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లలో ముందస్తు(ప్రీబడ్జెట్) ర్యాలీకి తెరలేవనున్నదని సీఎన్‌ఐ రీసెర్చ్ హెడ్ కిషోర్ ఓస్వాల్ అంచనా వేశారు. ఫైనాన్షియల్ రంగ సంస్కరణలతోపాటు, రక్షణ, రైల్వేలు వంటి వ్యవస్థలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని పెంచే అవకాశమున్నట్లు చెప్పారు.

    సంస్కరణలతో కూడిన పటిష్ట బడ్జెట్‌ను ట్రేడర్లు ఊహిస్తున్నారని జియోజిత్ బీఎన్‌పీ పరిబాస్ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాథ్యూ పేర్కొన్నారు. అయితే నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ మూడ్‌ను కొంతమేర దెబ్బకొట్టాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా నేచురల్ గ్యాస్ ధర పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయడమేకాకుండా రైల్వే చార్జీల పెంపు విషయంలో వెనక్కుతగ్గడం సెంటిమెంట్‌ను బలహీనపరిచిందని చెప్పారు. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో 80 కిలోమీటర్ల వరకూ సబర్బన్ రైళ్ల ద్వితీయ శ్రేణి టికెట్ ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం, నెలవారీ సీజన్ టికెట్ల ధరలను తగ్గించడం వంటి నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విషయం విదితమే.
     
    ఆరేళ్ల గరిష్టానికి పీనోట్స్ పెట్టుబడులు
    పార్టిసిపేటరీ నోట్ల(పీనోట్స్) ద్వారా దేశీ స్టాక్స్‌లోకి మళ్లే విదేశీ పెట్టుబడుల విలువ మే నెలలో 35 బిలియన్ డాలర్లకు(రూ. 2.12 లక్షల కోట్లు) చేరింది. ఇది గత ఆరేళ్లలోనే అత్యధికం. ఏప్రిల్ లో వీటి విలువ రూ. 1,87,486 కోట్లుగా నమోదైంది. అంటే 13% వృద్ధి నమోదైంది. సంపన్న వర్గాలు(హెచ్‌ఎన్‌ఐలు), హెడ్జ్ ఫండ్స్ తదితర విదేశీ ఇన్వెస్ట్‌మెంట్  సంస్థలు దేశీ మార్కెట్లో పీనోట్ల ద్వారా పెట్టుబడిపెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement