ముంబై : ఎగ్జిట్ పోల్ అంచనాలతో స్టాక్ మార్కెట్లో మెరుపులు సృష్టించిన సన్ టీవీ షేర్లు గురువారం ఢమాల్ మని పడిపోయాయి. తమిళనాడులో అన్నాడిఎంకె విజయం దాదాపు ఖాయం కావడంతో గురువారం నాటి ట్రేడింగ్ లో సన్ టీవీ షేర్లు 10శాతం మేర పతనమయ్యయి.. తమిళనాడులో ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ తో అమాంతం దూసుకుపోయిన ఈ షేర్లు, ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వస్తుండటంతో, పెట్టుబడిదారుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. కరుణానిధిపై తమిళ ఒటర్లు కరుణ చూపకపోవడంతో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అమ్మ జయలలిత పార్టీ అన్నాడీంఎకే 141 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో సన్ టీవీ షేర్లు కుదేలవుతున్నాయి.
కాగా అన్నాడీఎంకే ప్రత్యర్థి, ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధినే ఈ సారి ఎన్నికల్లో విజయం వరించబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో చెన్నైకు చెందిన ఈ సన్ టీవీ నెట్ వర్క్ షేర్లు జూమ్ అయ్యాయి. డీఎంకే పార్టీ గెలవబోతుందనే సంకేతాలతో సన్ టీవీ షేర్లు గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో జిగేల్ మనిపించాయి. సన్ టీవీ అధినేత కళానిధి మారన్, డీఎంకే అధినేతకరుణానిధికి మనువడు. పార్టీ హవా కొనసాగుతూ రికార్డు తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న అమ్మ దెబ్బకి సన్ టేవీ బేర్ మంది.