న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఫుడ్ డెలివరీ సేవలకు మాత్రమే పరిమితమైన స్విగ్గీ మరిన్ని విభాగాల్లోకి విస్తరిస్తోంది. నిత్యావసరాలు, ఔషధాలు మొదలైన వాటి డెలివరీ సేవలకు సంబంధించి లోకల్ కామర్స్ విభాగంలోకి అడుగుపెట్టనుంది. డిసెంబర్ 15న వీటిని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం స్థానిక సూపర్ మార్కెట్ చెయిన్స్, ఫార్మసీలు, మటన్ షాపులు, పెట్ స్టోర్స్, పూల విక్రేతలు మొదలైన వారితో స్విగ్గీ చేతులు కలపనున్నట్లు వివరించాయి. ప్రస్తుతం లోకల్ సర్వీసుల విభాగంలో డన్‌జో, మిల్క్‌బాస్కెట్, 1ఎంజీ వంటి సంస్థలతో స్విగ్గీ పోటీపడాల్సి రానుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. గూగుల్ తోడ్పాటు ఉన్న డన్‌జో.. ప్రస్తుతం స్థానిక కేర్‌టేకర్ తరహా కన్సీర్జ్ సేవలు అందిస్తోంది. హైదరాబాద్, గుర్‌గ్రామ్, పుణే, చెన్నై తదితర నగరాల్లో విస్తరించింది. కొంత భిన్నమైన సర్వీసుల కారణంగా స్విగ్గీ రాక వల్ల డన్‌జోకి తక్షణం వచ్చిన ముప్పేమీ ఉండబోదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, ఫార్మసీ డెలివరీ స్టార్టప్ 1ఎంజీలాంటి వాటిపై ప్రభావం పడొచ్చని సంబంధిత వివరించాయి.
ఖాళీ సమయాల సద్వినియోగం..
ప్రస్తుతం ఫుడ్ టెక్ కంపెనీగా స్విగ్గీ భారీ స్థాయిలో ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీకి సంబంధించి చాలామటుకు యూజర్లు వారంలో కనీసం అయిదుసార్లయినా స్విగ్గీ ద్వారా ఆర్డర్లిస్తున్నారు. సగటు ఆర్డరు పరిమాణం రూ. 300 దాకా ఉంటోంది. అయితే, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వాటి నుంచి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి డెలివరీకి మధ్య ఇతరత్రా కార్యకలాపాలేమీ లేక ఖాళీగా ఉంటోంది. ఇప్పటికే దాదాపు ఒకే ప్రాంతం నుంచి వచ్చే బహుళ ఆర్డర్లన్నింటినీ బ్యాచ్‌ల కింద మార్చి డెలివరీ చేయడం ద్వారా సిబ్బంది సేవల సమయాన్ని మెరుగ్గా వినియోగించుకుంటోన్న స్విగ్గీ వ్యూహాలకు మరింత పదును పెట్టడం మొదలెట్టింది. ఇందులో భాగంగానే పుడ్ డెలివరీ మధ్యలో ఖాళీ సమయాన్ని గణనీయంగా సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. కేవలం ఫుడ్ టెక్ కంపెనీగానే మిగిలిపోకుండా ఇతరత్రా విభాగాల్లోకీ విస్తరించాలన్న ఉద్దేశంతోనే తాజాగా లోకల్ కామర్స్‌లోకి ప్రవేశించడానికి కారణంగా సంబంధిత వర్గాలు వివరించాయి. తాజా వ్యాపార వ్యూహంలో విజయం సాధించగలమన్న విశ్వాసంతో ఉంది.
2–3 శాతం కమీషన్..
ప్రారంభంలో అమ్మకాలు పెరిగేదాకా వెండార్ల నుంచి స్విగ్గీ స్వల్పంగా 2–3% కమీషన్ వసూలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రతీ ఆర్డరు మీద డెలివరీ ఫీజు కూడా విధించవచ్చు. ప్రారంభంలో కొన్ని ఆఫర్లు ఇచ్చినా.. దశలవారీగా వాటిని తొలగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ల డెలివరీ వ్యయాలను తట్టుకునేందుకు 2–3% కమీషన్ చార్జీలు సరిపోకపోయినప్పటికీ.. వ్యాపారం పెరిగే కొద్దీ చార్జీలను, కమీషన్‌ను కూడా పెంచవచ్చనే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ డెలివరీ విభాగంలో కూడా స్విగ్గీ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేసింది. ప్రస్తుతం అత్యధిక యూసేజీ ఉన్న రెస్టారెంట్ల నుంచి ప్రతి ఆర్డరుపై దాదాపు 15 శాతం దాకా చార్జీ వసూలు చేస్తోంది.
లోకల్ మార్కెట్లోకి స్విగ్గీ
Published Sat, Nov 24 2018 1:24 AM | Last Updated on Sat, Nov 24 2018 5:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment