తగ్గిన టాటా మోటార్స్ ఆదాయం, లాభం
ఫారెక్స్ ప్రతికూల ఎఫెక్ట్
ముంబై: ఫారెక్స్ మార్పిడి నష్టాల కారణంగా 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ లాభం, ఆదాయం...రెండూ తగ్గాయి. కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ. 5,211 కోట్ల నుంచి రూ. 4,336 కోట్లకు తగ్గగా, కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 79,549 కోట్ల నుంచి రూ.77,272 కోట్లకు క్షీణించింది. బ్రిటన్ పౌండు బాగా క్షీణించడం, అదే సమయంలో రూపాయి బలపడటంతో బ్రిటన్ కరెన్సీ నుంచి భారత్ కరెన్సీలోకి జరిగిన మార్పిడి ఫలితంగా ముగిసిన త్రైమాసికంలో రూ. 9,032 కోట్ల ఆదాయం తగ్గినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 2.73,111 కోట్ల నుంచి రూ. 2,69,850 కోట్లకు తగ్గగా, నికరలాభం రూ. 11,678 కోట్ల నుంచి రూ. 7,557 కోట్లకు క్షీణించింది. తమ సబ్సిడరీ జాగ్వర్ లాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) రిటైల్ అమ్మకాలు 13% వృద్ధిచెందినట్లు కంపెనీ ప్రకటించింది. మార్చి క్వార్టర్లో జేఎల్‌ఆర్ 55.7 కోట్ల డాలర్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ ముగిసిన త్రైమాసికంలో రూ. 13,621 కోట్ల ఆదాయంపై రూ. 818 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఫ్లాట్‌గా రూ. 450 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెల్లడికాగా, మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో కంపెనీ ఏడీఆర్ కడపటి సమాచారం అందేసరికి 5%పైగా ఎగిసి 36.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.