రూ.2.5 లక్షల డిపాజిట్లపై ప్రశ్నలుండవు..
స్పష్టతనిచ్చిన ఆదాయ పన్ను శాఖ
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లోకి వెల్లువెత్తిన నగదుపై పన్నులపరమైన చర్యలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ స్పష్టతనిచ్చింది. రూ. 2.5 లక్షల దాకా డిపాజిట్ మొత్తాలపై ఎటువంటి ప్రశ్నలు ఉండబోవని.. పన్ను రిటర్నులతో పొంతన లేని ఖాతాలపైనే ప్రత్యేకంగా దృష్టి ఉంటుం దని వివరించింది. అత్యాధునిక డేటా విశ్లేషణ సాధనాలతో రూ. 2 లక్షల నుంచి రూ. 80 లక్షలు, అంతకు పైబడిన డిపాజిట్ల మొత్తాలను వేర్వేరుగా గుర్తించామని పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న విధంగా రూ. 2.5 లక్షల దాకా డిపాజిట్ల డేటాను ప్రస్తుతానికైతే పక్కన పెట్టామని ఆయన వివరించారు. పన్నుపరమైన ప్రభావాలను ప్రస్తావిస్తూ .. ఉదాహరణకు పన్ను పరిధిలోకి వచ్చేవిధంగా రూ. 10 లక్షల పైచిలుకు ఆదాయం గలవారు రూ. 3 లక్షల మేర డిపాజిట్ చేయడం సమర్ధనీయమైనదేనని, అటువంటి వారి జోలికి తాము వెళ్లబోమని చంద్ర పేర్కొన్నారు. అయితే, గత మూడేళ్లలో ఐటీ రిటర్నులు దాఖలు చేయకుండా ఎకాయెకిన రూ. 5 లక్షలు డిపాజిట్ చేసిన వారి కేసులు పరిశీలించే అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. మరోవైపు స్క్రూటినీ చేపట్టిన సందేహాత్మక కేసుల్లో మాత్రం పన్ను రీఫండ్‌లను ఆపి ఉంచడం జరుగుతుందని చంద్ర చెప్పారు.