గణాంకాలు, ఫలితాలు కీలకం | TCS, Infosys to kick off Q1 earnings next week, brokerages largely wary of IT's health | Sakshi
Sakshi News home page

గణాంకాలు, ఫలితాలు కీలకం

Published Mon, Jul 10 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM

గణాంకాలు, ఫలితాలు కీలకం

గణాంకాలు, ఫలితాలు కీలకం

క్యూ1 ఫలితాల వెల్లడి ఆరంభం
13న టీసీఎస్, 14న ఇన్ఫోసిస్‌
ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల ప్రభావం కూడా
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం


ఈ వారం నుంచి ఫలితాల సీజన్‌ ప్రారంభం కానున్నది. ఈ వారంలో వెల్లడయ్యే కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని వారంటున్నారు. రుతుపవనాల విస్తరణ, ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కూడా స్టాక్‌ సూచీలపై  ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు.

జీఎస్‌టీ అమలు సాఫీగా సాగిపోతోందని, ఇక ఇప్పుడు మార్కెట్‌ దృష్టి కంపెనీలు వెల్లడించే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఉంటుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. వీటితో పాటు పారిశ్రామికోత్పత్తి, టోకు ధరల, వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని వివరించారు. ఈ గణాంకాలను బట్టే స్టాక్‌ సూచీల కదలికలు ఆధారపడి ఉంటాయని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ డైరెక్టర్‌ అభ్నిశ్‌ కుమార్‌ సుధాంశు చెప్పారు.

మే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 12న (బుధవారం) మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడవుతాయి. అదే రోజు జూన్‌ నెలకు సంబంధించిన రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్‌ ముగిసిన తర్వాతనే  వస్తాయి. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ నెల 14న (శుక్రవారం) వస్తాయి.

గురువారం టీసీఎస్‌ ఫలితాలు...
ఈ నెల 13న(గురువారం) టీసీఎస్‌ ఫలితాలు వస్తాయి. శుక్రవారం (ఈ నెల 14న) ఇన్ఫోసిస్‌ ఫలితాలు వస్తాయి. ఇక ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఈ నెల 11న (మంగళవారం) క్యూ1 ఫలితాలను వెల్లడిస్తుంది. అదే రోజు సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్, ఆమ్‌టెక్‌ ఆటో, సీసీఎల్‌ ప్రొడక్ట్స్, మోనెట్‌ ఇస్పాత్‌ కంపెనీలు కూడా క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి.  బుధవారం (ఈ నెల12న) బజాజ్‌ కార్ప్‌ ఫలితాలను ప్రకటిస్తుంది. ఈ నెల 13(గురువారం) టీసీఎస్‌తో పాటు సైయంట్, గోవా కార్బన్, హట్సన్‌ ఆగ్రో, ఇన్పీబీమ్, ఎంసీఎక్స్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రా కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. శనివారం (ఈ నెల 15న) కర్ణాటక బ్యాంక్, గృహ ఫైనాన్స్‌ కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తాయి.

ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే సోమవారం నాడు చైనా రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. బుధవారం (ఈ నెల 12న) యూరప్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, చైనా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు వెల్లడవుతాయి. ఈ నెల 14న అమెరికా మే నెల పారిశ్రామికోత్పత్తి, జూన్‌ నెల రిటైల్‌ అమ్మకాలు, జూన్‌ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఇదే రోజు జపాన్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడవుతాయి.

విదేశీ పెట్టుబడుల జోరు...
విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది జూన్‌ వరకూ అంటే మొదటి ఆర్నెల్లలో 2,300 కోట్ల డాలర్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. గత ఏడాది ఇదే కాలానికి విదేశీ పెట్టుబడులు 120 కోట్ల డాలర్లు(రూ.7,600 కోట్లు)గా ఉన్నాయి. 2019లో ఎన్నికలు రానున్నాయని, ఎన్నికలకు ఉన్న రెండేళ్ల వ్యవధిలోనే కేంద్రం మరిన్ని సంస్కరణలు తెస్తుందన్న అంచనాల కారణంగానే విదేశీ పెట్టుబడులు జోరుగా వచ్చాయని మార్నింగ్‌ స్టార్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. జీఎస్‌టీ అమలు, వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు కూడా సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేశాయని వివరించారు. ఈ ఏడాది జనవరి–జూన్‌ కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.53,354 కోట్లు(820 కోట్ల డాలర్లు), డెట్‌ మార్కెట్లో రూ.94,199 కోట్లు(1,450 కోట్ల డాలర్లు) చొప్పున ఇన్వెస్ట్‌ చేశారని డిపాజటరీ సంస్థల గణాంకాలు వెల్లడించాయి.

మొత్తం మీద విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రూ.1,47,553 కోట్లు(2,266 కోట్ల డాలర్లు) నికరంగా ఇన్వెస్ట్‌ చేశారు. భారత కరెన్సీ రూపాయి నిలకడగా ఉండటం వల్ల కూడా డెట్‌ మార్కెట్లో జోరుగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని షేర్‌ఖాన్‌ అనలిస్ట్‌ హేమాంగ్‌ జని చెప్పారు. ఈ ఏడాది మొదటి నెలలో విదేశీ ఇన్వెస్టర్లు తమ  పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. కానీ ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు పెట్టటం ప్రారంభించారు.  ఈ జోరు జూన్‌ వరకూ కొనసాగింది. ఈ జోరు మరింతగా కొనసాగాలంటే విదేశీ ఇన్వెస్టర్ల అంచనాలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement