టెక్ మహీంద్రా లాభం 720 కోట్లు
ఆదాయం రూ. 5,488 కోట్లు
ముంబై: ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి రూ. 720 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 718 కోట్లతో పోలిస్తే ఇది నామమాత్ర వృద్ధి. అయితే గత లాభాల్లో ఒక భారీ డీల్ కారణంగా లభించిన 9 మిలియన్ డాలర్లు(రూ. 54 కోట్లు) కలసి ఉన్నట్లు కంపెనీ సీఎఫ్‌వో మిలింద్ కులకర్ణి తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుత లాభాలను రూ. 46 కోట్ల ఫారెక్స్ నష్టాలు కూడా ప్రభావితం చేసినట్లు తెలిపారు. ఇటీవల హెడ్జింగ్ వ్యూహాన్ని మార్చుకున్నామని, కరెన్సీ ఒడిదుడుకుల రక్షణ కాలాన్ని ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదించామని చెప్పారు.
డాలరుతో మారకంలో రూపాయి భారీ హెచ్చుతగ్గులకు లోనుకావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఆదాయం మాత్రం 15% ఎగసి రూ. 5,488 కోట్లకు చేరింది. గతంలో రూ. 4,772 కోట్ల ఆదాయం నమోదైంది. డాలర్లలో చూస్తే నికర లాభం 11.8 కోట్లు, ఆదాయం 90 కోట్ల డాలర్లుగా నమోదైంది. వ్యూహాత్మక పెట్టుబడుల కొనసాగింపు ద్వారా కీలక విభాగాల్లో వృద్ధి సాధించగలిగామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక కాంట్రాక్ట్‌లను పొందడంపై ఆశావహంగా ఉన్నట్లు వినీత్ చెప్పారు.
95,309కు సిబ్బంది సంఖ్య
క్లయింట్ల సంఖ్య 17 పెరిగి 649కు చేరగా, 2,580 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 95,309ను తాకింది. వీరిలో సాఫ్ట్‌వేర్ బిజినెస్‌లో 66,175 మంది, బీపీవో విభాగంలో 22,433 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఉద్యోగవలస(అట్రిషన్) 16% నుంచి 18%కు పెరిగింది. నగదు, తత్సమాన నిల్వలు రూ. 3,434 కోట్లుగా నమోదయ్యాయి. కమ్యూనికేషన్స్ డొమైన్, ఎంటర్‌ప్రైజ్ డొమైన్‌లలో కంపెనీకున్న ప్రత్యేకతల కారణంగా మార్కెట్లో మరింత విస్తరించగలుగుతున్నామని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 1% పెరిగి రూ. 2,397 వద్ద ముగిసింది.