
టెక్ మహీంద్రా లాభం 6శాతం డౌన్
ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 6 శాతం క్షీణించింది.
న్యూఢిల్లీ: ఐటీ సేవల కంపెనీ టెక్ మహీంద్రా నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 6 శాతం క్షీణించింది. గత క్యూ3లో రూ.777 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.759కోట్లకు పడిపోయిందని టెక్ మహీంద్రా తెలిపింది. ఇతర ఆదాయం తగ్గడం, ఆదాయ వృద్ధి మందకొడిగా ఉండడం వల్ల నికరలాభం తగ్గిందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సి.పి. గుర్నాని చెప్పారు. సీక్వెన్షియల్‌గా చూస్తే నికర లాభం 4 శాతం క్షీణించిందని తెలిపారు.
ఆదాయం మాత్రం రూ.5,752 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.6,701 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సీజనల్‌గా బలహీనంగా ఉండే ఈ క్యూ3లో వృద్ధి సాధించడానికి తగిన ప్రయత్నాలు చేశామని చెప్పారు. ఐటీ వ్యాపారం ఆదాయం రూ.6,172 కోట్లుగా, బీపీఓ విభాగం ఆదాయం రూ.529 కోట్లుగా ఉన్నాయని చెప్పారు. గత రెండు క్వార్టర్ల నుంచి మార్జిన్లు క్రమక్రమంగా మెరుగుపడుతున్నాయని టెక్ మహీంద్రా వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. క్యూ3లో 1,902 మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నామని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,07,137కు చేరిందని తెలిపారు.