
న్యూఢిల్లీ: ప్రస్తుత స్వరూపంలో ఆపరేటర్లకు సముచిత స్థాయిలో రాబడులు వచ్చే అవకాశాలు లేనందున టెలికం టారిఫ్‌లు తప్పకుండా మరింత పెరగవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. టెల్కోలు వచ్చే 12–18 నెలల వ్యవధిలో మరో రెండు విడతలు పెంచవచ్చని పేర్కొంది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లోనే ఒక విడత పెంచే అవకాశం ఉందని ఈవై లీడర్ (వర్ధమాన దేశాల టెక్నాలజీ, మీడియా, టెలికం విభాగం) ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. అయితే, ఇదంతా కరోనా వైరస్‌పరమైన పరిణామాలు, యూజర్ల చెల్లింపు సామర్థ్యాలపై పడిన ప్రతికూల ప్రభావాలు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.