ప్రపంచం మీ కాళ్ల కింద..! | The GPS 'smart shoe' that can track | Sakshi
Sakshi News home page

ప్రపంచం మీ కాళ్ల కింద..!

Published Sat, May 23 2015 1:20 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

ప్రపంచం మీ కాళ్ల కింద..!

ప్రపంచం మీ కాళ్ల కింద..!

- ‘లేచల్’ అంటున్న  హైదరాబాదీ స్టార్టప్
- జీపీఎస్, సెన్సార్లతో పనిచేసే స్మార్ట్ షూ తయారీ
- ఎవరి సహాయం లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు
- మార్కెట్లోకి రాకముందే 145 దేశాల నుంచి 50,000 ప్రీ-ఆర్డర్లు
- సెప్టెంబర్ నుంచి రిటైల్ మార్కెట్లోకి లేచల్ బూట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ప్రపంచాన్ని జయించాలంటే అలగ్జాండరే కానవసరం లేదు! కత్తి యుద్ధంలో చేయి తిరగాల్సిన అవసరం అంతకంటే లేదు!! కావాల్సిందల్లా కాసింత బుర్ర. కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదల, దానికి తగ్గ ప్రణాళిక. అచ్చం దీన్నే ఫాలో అయ్యాడు హైదరాబాదీ యువకుడు క్రిస్పియన్ లారెన్స్. మిచిగాన్ యూనివర్శిటీ పట్టభద్రుడైన ఈయన... లాభాల కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే సంస్థను స్థాపించాలనుకున్నాడు. రెండేళ్లపాటు శ్రమించి సహచరుడు అనిరుధ్ శర్మతో కలిసి డ్యుకేర్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించారు.  ‘లే చల్’ బ్రాండ్ పేరుతో షూ, ఇన్‌సోల్‌లను తయారు చేశారు. వీటి ప్రత్యేకత ఏంటంటే.. జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే ఈ షూలతో తెలియని ప్రాంతాలకు కూడా ఎవరి సహాయం అక్కర్లేకుండా చేరుకోవొచ్చు. దీనిపై క్రిస్పి లారెన్స్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... లే చల్ విశేషాలను వివరించారు. అది ఆయన
మాటల్లో చెప్పాలంటే...

షూనే ముడి సరుకుగా ఎందుకు ఎంచుకున్నామంటే.. ఇప్పటికే మార్కెట్లో జీపీఎస్‌తో పనిచేసే గూగుల్ కళ్లద్దాలు, వాచ్‌ల వంటివి ఉన్నాయి. నిజానికి మనం బయటకు వెళుతున్నపుడు వాటిని మరిచిపోయే ప్రమాదముంది. కానీ, షూ లేకుండా ఎక్కడికీ వెళ్లం కదా? అందుకే దీన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం లే చల్ (అంటే నన్నూ తీసుకుపో అని అర్థం) బ్రాండ్‌తో షూ, ఇన్‌సోల్(దీన్ని మనకు ఏ షూలో కావాలంటే అందులో అమర్చుకోవచ్చు) 2 రకాల ఉత్పత్తులున్నాయి. నలుపు, ఎరుపు రంగుల్లో స్త్రీ, పురుషులిద్దరి ఇవి లభిస్తున్నాయి. వీటి ధరలు 150-200 డాలర్లు. మూగ, చెవిటి వాళ్లకు 30-40% రాయితీ ఇస్తున్నాం. ఇందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌తో ఒప్పందం చేసుకున్నాం. ఆర్డరిచ్చిన నెల రోజుల్లో డెలివరీ చేస్తాం.

ముందైతే మూగ, చెవిటి వాళ్లకే..
కంపెనీ అంటే డబ్బు సంపాదన మాత్రమే కాదు. సమాజానికీ ఉపయోగపడాలన్నది నా కోరిక. అందుకే 2010లో డుకేర్ టెక్నాలజీస్‌ను స్థాపించాలనే ఆలోచన వచ్చినపుడు లే చల్ షూలను కేవలం మూగ, చెవిటి వాళ్ల కోసమే తయారు చేసేవాళ్లం. రెండేళ్ల తర్వాత ‘‘మనకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి అడ్రస్‌ల గురించి ఇతరులను అడిగే బదులు లే చల్ షూలోని జీపీఎస్, సెన్సర్లను వినియోగించుకుంటే పోలే’’ అనిపించింది. వెంటనే అందరికీ ఉపయోగపడేలా చిన్న చిన్న మార్పులు చేసి ఫ్యాషన్ బ్రాండ్‌గా మార్కెట్లోకి విడుదల చేశాం. వీటి తయారీలో హై క్వాలిటీ థెర్మోప్లాస్టిక్ పాలీ యుతేరెన్, పాలియెస్టర్ ఫ్యాబ్రిక్, రబ్బర్, ఏబీపీసీ, ఇథలిన్ వినైల్ అసిటేట్(ఈవీఏ), పాలీప్రొపైలన్ (పీపీ)వినియోగిస్తాం. ఈ షూలు నీట్లో వాడినా ఏమీకావు. యాంటి బ్యాక్టీరియల్ కూడా.

వైబ్రేషన్సే బండ గుర్తులు
ముందుగా సెల్‌ఫోన్‌లో డ్యుకేర్ టెక్నాలజీ ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వెళ్లాల్సిన చోటును ముందే ఆప్‌లో చెప్పాలి. వెంటనే అది మనం కాలుకు తొడుకున్న షూస్‌లోని జీపీఎస్, సెన్సార్ వ్యవస్థకు అనుసంధానమవుతుంది. దీన్ని కేవలం నడిచేటప్పుడే కాదు.. బైక్ మీద వెళ్తున్నప్పుడూ వినియోగించవచ్చు. మనం వెళ్తున్న సమయంలో మనం కుడి వైపునకు మళ్లాల్సి వచ్చినప్పుడు కుడి వైపుకు, ఎడమ వైపుకు మళ్లాల్సి వచ్చినప్పుడు ఎడమ వైపునకు షూలో వైబ్రేషన్స్ వస్తాయి. దానర్థం మనం దారి మళ్లాలని. ఇలా మనం ఎంచుకున్న స్థానానికి కాలికున్న షూ తీసుకెళుతుందన్న మాట. మనం ఎంత దూరం నడిచాం? ఇంకెంత దూరముంది? ఎంత వేగంతో నడుస్తున్నాం? ఎంత సమయంలో చేరుకున్నాం? ఎన్ని కేలరీలు కరిగాయి? వంటి ఆడియో ఫీడ్ బ్యాక్‌ను కూడా ఇస్తాయి. అవసరం లేనప్పుడు షూలను చార్జింగ్ చేసుకుంటే సరి.

సెప్టెంబర్ నుంచి రిటైల్ మార్కెట్లోకి..
ప్రస్తుతం మా ఉత్పత్తులను లే చల్ వెబ్‌సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సెప్టెంబర్ నుంచి రిటైల్ మార్కెట్లోకి వస్తున్నాం. దీనికోసం దేశంలోని పెద్ద పెద్ద రిటైల్ చైన్లతో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఏడాది ముగిసేనాటికి అంతర్జాతీయ స్పోర్ట్స్ బ్రాండ్స్‌తో కలిసి స్పోర్ట్స్ షూను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఇప్పటికి 145 దేశాల నుంచి వచ్చిన 50,000 షూల ప్రీ ఆర్డర్లను ఈ నెలాఖరుకు డెలివరీ చేస్తున్నాం. ఇందులో ఇండియాతో పాటు అమెరికా, జపాన్, యూరప్ దేశాల వాటా ఎక్కువగా ఉంది. 2016 డిసెంబర్ నాటికి 10 లక్షల స్థాయిని చేరుకోవాలనేది మా లక్ష్యం.
 
స్టార్టప్ డైరీ

స్టార్టప్‌ల అడ్డా హైదరాబాద్‌లో పుట్టుకొస్తున్న కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలకు సైతం సవాలు విసురుతున్నాయి. మీరు చేయలేని పని మేం చేస్తున్నాం చూడమంటూ కవ్విస్తున్నాయి. అలాంటిదే ఈ స్టార్టప్ కంపెనీ ‘లే చల్’ కూడా.
 
కొంపల్లిలో మరో యూనిట్..
ప్రస్తుతం సికింద్రాబాద్‌లో నెలకు 40 వేల షూలు, ఇన్‌సోల్‌లు ఉత్పత్తి చేసే యూనిట్ ఉంది. త్వరలోనే కొంపల్లిలో మరో యూనిట్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం మా కంపెనీలో 80 మంది ఉద్యోగులున్నారు. అసెంబుల్ సెక్షన్‌లో 70% సిబ్బంది మూగ, చెవిటి వాళ్లే. వాళ్ల సమస్యలేంటో వారికే సరిగ్గా తెలుస్తాయి కనక వారిని నియమించుకున్నాం. చైనా, సింగపూర్, జపాన్‌ల నుంచి ఎలక్ట్రానిక్స్, సెన్సర్లు, బ్యాటరీలు దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని భారత్‌లోనే తయారు చేస్తున్నాం.
 
5 మిలియన్ డాలర్ల పెట్టుబడులు..

రూ.2 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించిన కంపెనీ ఇప్పుడు రూ.15 కోట్లకు చేరింది. 2013లో ఓ దేశీ టెక్నాలజీ సంస్థ 2 మిలియన్ల అమెరికా డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ ఏడాది ముగిసేనాటికి మరో 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. పూర్తిస్థాయిలో మార్కెట్లోకి రావటానికి టర్నోవర్‌లో 5-10 శాతం మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాం. లే చల్ షూ, ఇన్‌సోల్‌పై అమెరికా, ఇండియాల్లో 24 రకాల పేటెంట్స్ తీసుకున్నాం.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement