ఇక దిక్సూచి ఆర్‌బీఐ నిర్ణయమే
స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనా
జీడీపీ గణాంకాల ఎఫెక్ట్ ఉంటుంది
పార్లమెంట్ సమావేశాలకు ప్రాధాన్యత
తీవ్ర హెచ్చుతగ్గులకు అవకాశం
న్యూఢిల్లీ: సామాన్యుడి దగ్గర్నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షపై స్టాక్ మార్కెట్లు సైతం దృష్టిపెట్టాయి. మంగళవారం(2న) రిజర్వ్ బ్యాంక్ చేపట్టనున్న విధాన సమీక్ష ఇకపై స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక గడిచిన శుక్రవారం(28న) మార్కెట్లు ముగిశాక వెలువడ్డ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. వీటితోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశ విశేషాలు, ఆర్థిక సంకేతాలు కీలకంగా నిలవనున్నాయని వివరించారు. ప్రధాన సూచీలు ఈ వారం కొంతమేర ఒడిదుడుకులను చవిచూసే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు. నవంబర్ నెలకు ఆటో రంగ అమ్మకాలు వెల్లడికానున్నాయి. దీంతో ఆటో రంగ షేర్లు వెలుగులో నిలుస్తాయని అంచనా వేశారు.
వడ్డీ కోత అంచనాలు...: గత వారం చివర్లో సరికొత్త గరిష్టాలను చేరిన మార్కెట్లపై 5.3%కు పరిమితమైన జీడీపీ వృద్ధి ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు విశ్లేషించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఆర్థిక వ్యవస్థ 5.7% వృద్ధి సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపువైపు దృష్టిపెట్టే అవకాశంలేకపోలేదని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే మార్కెట్లలో కనిపిస్తున్న ప్రస్తుత సానుకూల వాతావరణం కారణంగా ప్రధాన సూచీలు ఈ వారం కూడా కొత్త రికార్డులను సృష్టించే అవకాశముందని చెప్పారు.
అంత సులువుకాదు: పార్లమెంట్ సమావేశాలు, పాలసీ సమీక్ష వంటి అంశాల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అంచనా వేశారు. ట్రేడర్లు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని సూచించారు. నవంబర్ నెలకు హెచ్‌ఎస్‌బీసీ తయారీ పీఎంఐ డేటా సోమవారం(1న), సర్వీసెస్ డేటా బుధవారం(3న) విడుదలకానున్నాయి. ఇంకా, నవంబర్ వాహన విక్రయాలు సోమవారం వెల్లడికానున్నాయి.