
డాలర్ బలహీనతే పసిడికి బలం..
డాలర్ బలహీనపడే అవకాశాలు పసిడి ధర పెరుగుదలకు బలంగా కనిపిస్తున్నాయని చార్టెడ్ మార్కెట్
న్యూఢిల్లీ/న్యూయార్క్: డాలర్ బలహీనపడే అవకాశాలు పసిడి ధర పెరుగుదలకు బలంగా కనిపిస్తున్నాయని చార్టెడ్ మార్కెట్ టెక్నీషియన్, మార్కెట్ టెక్నీషియన్స్ అసోసియేషన్ సభ్యుడు జోర్టాన్ రాయ్-బయార్న్ విశ్లేషించారు. కరెన్సీ విలువలు ప్రత్యేకించి డాలర్ బలహీనత పలు సందర్భాల్లో పసిడి పటిష్టతకు కారణమయ్యిందని పేర్కొన్న ఆయన, ఇప్పు డూ దాదాపు అదే పరిస్థితి కనబడుతోందన్నారు. గత కొద్ది కాలంలో పలు మెటల్స్‌తోపాటు, పసిడి కూడా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి వెనక్కు తగ్గినా.. ఆర్థిక అనిశ్చితుల వల్ల కొనుగోళ్ల అవకాశం మున్ముందూ కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సమీక్షా వారంలో...
కాగా గత శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా)కు అంతక్రితం వారం ఉన్న స్థాయి 1,341 డాలర్ల వద్ద ముగిసింది. ఇక దేశీయంగా ప్రధాన బులియన్ మార్కెట్ ముంబైలో ధర 99.9 స్వచ్ఛత, 99.5 స్వచ్ఛత ధరలు స్వల్పంగా రూ.90 తగ్గాయి. వరుసగా రూ.31,370, రూ.31,220 వద్ద ముగిశాయి. ఇక వెండి కేజీ ధర వారం వారీగా రూ.670 తగ్గి, రూ. 47,040 వద్ద ముగిసింది.