పన్నుల వ్యవస్థ మరింత పారదర్శకం
► రూ. 5 లక్షల లోపు కేసుల స్క్రూటినీ వేగవంతం
► అసెసీలకు నిర్దిష్ట ప్రశ్నావళి సీబీడీటీ ఆదేశాలు
న్యూఢిల్లీ: అవినీతిని అరికట్టేందుకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులను కల్పించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టింది. కేసుల స్క్రూటినీకి సంబంధించి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం స్క్రూటినీ కోసం ఎంపిక చేసిన కేసుల్లో అసెసీలను వివిధ రకాల ప్రశ్నలతో గందరగోళపర్చకుండా నిర్దిష్ట ప్రశ్నావళిని మాత్రమే పంపాలని సూచించింది.
లెక్కల్లో చూపని ఆదాయాలు రూ. 5 లక్షల లోపు ఉన్న కేసుల స్క్రూటినీని పరిమిత హియరింగ్స్‌లో అధికారులు వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. లెక్కల్లో చూపని ఆదాయ పరిమాణం రూ. 5 లక్షలు మించినట్లు (హైదరాబాద్ సహా నాలుగు మెట్రోల్లో ఈ పరిమాణం రూ. 10 లక్షలు దాటితే) అసెసింగ్ అధికారి గానీ భావించిన పక్షంలో సదరు కేసులపై పూర్తి స్థాయి స్క్రూటినీ చేపట్టవచ్చని సీబీడీటీ తెలిపింది.