
హైదరాబాద్: తాజా మొండి బకాయిలు తగ్గాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ మొండి బకాయిల ఖాతాలకు సంబంధించి పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీలో ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మొండి బకాయిలు తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో మొండి బకాయిలు పెరగవు...
ఎన్‌సీఎల్‌టీకి నివేదించిన భారీ మొండి బకాయిల్లో కొన్ని కేసులు పరిష్కారమయ్యాయని, మరి కొన్ని కేసుల్లో పరిష్కారం తుది దశలో ఉందని ప్రవీణ్ కుమార్ గుప్తా వివరించారు. మొత్తం మీద రానున్న రెండు నెలల్లో ఈ బకాయిల సమస్య ఒక కొలిక్కి రాగలదన్నారు. తాజా మొండి బకాయిలు తగ్గాయంటూ... భవిష్యత్తులో మొండి బకాయిలు పెరిగే సమస్యే లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో మాత్రమే వ్యవసాయ రంగ రుణాల్లో మొండి బకాయిలు పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ ధోరణి లేదని గుప్తా స్పష్టంచేశారు. పాత డెబిట్ కార్డ్‌ల స్థానంలో మరింత సురక్షితమైన ఫీచర్లున్న కొత్త డెబిట్ కార్డ్‌ల జారీ కొనసాగుతోందన్నారు. పాత డెబిట్ కార్డులను మార్చుకోవడానికి ఈ నెల 31 గడువు తేదీ అని, ఇప్పటికే చాలా వరకూ కొత్త కార్డ్‌లను జారీ చేశామని వివరించారు.