సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్ నెంబర్ పోర్టబులిటీ.... నెంబర్ మారకుండా ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌లోకి మారడం. తొలుత 2010లో టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఈ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. ఇలా నెట్‌వర్క్ మార్చుకున్నందుకు గాను పోర్టబులిటీ ఛార్జీగా రూ.19ను ట్రాయ్ నిర్ణయించింది. అయితే ఈ ఛార్జీలు ప్రస్తుతం 80 శాతం మేర తగ్గిపోనున్నాయి.. ఇన్ని రోజులు ఉన్న పోర్టబులిటీ ఛార్జీలను రూ.19 నుంచి రూ.4కు తగ్గించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. దీనిపై డిసెంబర్ 29 వరకు వాటాదారులు తమ స్పందన తెలుపాలని ట్రాయ్ కోరింది. దేశవ్యాప్తంగా ఈ సిస్టమ్ 2015 నుంచి పూర్తిగా అమల్లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి నెంబర్ పోర్టబులిటీకి అనూహ్య స్పందన వస్తోంది. మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసు ప్రొవైడర్ల కార్యకలాపాల వ్యయాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ప్రస్తుతమున్న రూ.19 చాలా అధికంగా ఉందని ట్రాయ్ గుర్తించింది.
అంతేకాక నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనలు కూడా 2014-15లో 3.68 కోట్లు ఉంటే, 2016-17 నాటికి ఇవి 6.36 కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో పోర్టబులిటీ ఛార్జీలను తగ్గించాలని ట్రాయ్ నిర్ణయించింది. ఒక్కో పోర్టు లావాదేవీ అప్పర్ సీలింగ్‌ను తగ్గించాలని అథారిటీ నిర్ణయించిందని ట్రాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. ట్రాయ్ అంతకముందు నిర్ణయించిన పోర్టబులిటీ ఛార్జీలు ఎనిమిదేళ్ల క్రితం రెండు మొబైల్ నెంబర్ పోర్టబులిటీ సర్వీసు ప్రొవైడర్లు సమర్పించిన ఆర్థిక డేటా ఆధారంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఒక్కో పోర్టు లావాదేవి ఖర్చు తగ్గిందని 2016-17లో వార్షిక అకౌంట్లలో తేలింది. దీంతో ఈ ఛార్జీలను కూడా రూ.4కు తగ్గించాలని ట్రాయ్ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment