ప్రయాణికుల రైళ్లను ప్రయివేట్ సంస్థలు సైతం నిర్వహించేందుకు రైల్వే శాఖ ఆహ్వానం పలకడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. మొత్తం 109 రూట్లలో రెండు వైపులా ప్యాసింజర్ ట్రయిన్ల నిర్వహణకు ఆసక్తి ఉన్న కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చంటూ రైల్వే శాఖ తాజాగా పేర్కొంది. అర్హతగల కంపెనీలు ప్రతిపాదనలు పంపించవలసిందిగా కోరింది. 151 ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు రైల్వే శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో రైల్వే సంబంధిత కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. వెరసి ఈ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
కూ.. చుక్‌చుక్
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రైల్ వికాస్ నిగమ్ 8 శాతం జంప్‌చేసి రూ. 21కు చేరగా.. రైట్స్ లిమిటెడ్ 5.5 శాతం ఎగసి రూ. 272 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రైట్స్ షేరు రూ. 292 వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో ఐఆర్‌సీటీసీ 4.5 శాతం పెరిగి రూ. 1424 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 1468 సమీపానికి ఎగసింది. ఇక సిమ్‌కో లిమిటెడ్ 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 18.5 వద్ద నిలవగా.. టెక్స్‌మాకో రైల్ ఏకంగా 16 శాతం పరుగు తీసింది. రూ. 30.5 వద్ద ట్రేడవుతోంది. ఇక టిటాగఢ్ వేగన్స్ సైతం 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 36 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో బీఈఎంఎల్, ఎల్‌అండ్‌టీ తదితరాలు సైతం స్వల్ప లాభాలతో కదులుతున్నాయి.
రూ. 30,000 కోట్లు
దేశీ రైల్వే నెట్‌వర్క్‌లోని 12 క్లస్టర్లలో 109 మార్గాలలో రెండు వైపులా ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఇందుకు రూ. 30,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించవలసి ఉంటుందని అంచనా. ఇందుకు వీలుగా అర్హతగల ప్రయివేట్ సంస్థలకు ఆహ్వానం పలికింది. తద్వారా ఆధునిక సాంకేతికతో కూడిన కోచ్‌లు, ప్రయాణ సమయం తగ్గింపు, నిర్వహణ వ్యయాల అదుపు, భద్రత పెంపు వంటి సానుకూలతలకు తెరతీయాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందుకు ఆసక్తి గల ప్రయివేట్ సంస్థలు ప్రతిపాదనలు పంపించవలసిందిగా రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. 35 ఏళ్లపాటు కన్సెషన్ గడువును విధించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment