
ఉబెర్ చెల్లింపులకు యూపీఐ యాప్
బెంగళూరు: ఆన్‌లైన్ మాధ్యమంలో చెల్లింపులను సులభతరం చేసే ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ) మరింతగా ప్రాచుర్యంలోకి వస్తోంది. దీని ద్వారా నగదు బదిలీ లావాదేవీలు నిర్వహించే సంస్థల జాబితాలో తాజాగా ట్యాక్సీ సర్వీసుల కంపెనీ ఉబెర్, ఈకామర్స్ సంస్థ అమెజాన్ కూడా చేరనున్నాయి. ఇవి రెండూ కూడా తమ లావాదేవీలకు యూపీఐ ఆధారిత భీమ్ యాప్‌ను వినియోగించడం ఈ నెల నుంచే ప్రారంభించనున్నాయి. అటు సెర్చి దిగ్గజం గూగుల్ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది.
ఇప్పటికే తమ సేవలకు సంబంధించి యూపీఏ పేమెంట్ సర్వీసుల విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించడం పూర్తి చేసింది. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎండీ ఏపీ హోతా ఈ విషయాలు తెలిపారు. ‘వాట్సాప్, ఫేస్‌బుక్, గూగుల్ మొదలైన కంపెనీలు కూడా యూపీఐ విధానాన్ని ఉపయోగించే క్రమంలో ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఇవి సాకారం కాగలవు. ఇప్పటికే టెస్టింగ్ మొదలైనవి పూర్తి చేసుకున్న గూగుల్ .. మిగతా వాటన్నింటికన్నా ముందుగా దీన్ని అందుబాటులోకి తేవొచ్చు‘ అని ఆయన వివరించారు.