న్యూఢిల్లీ: భారీగా నగదు నిల్వలున్న ప్రభుత్వ రంగ అన్‌లిస్టెడ్ సంస్థలు.. ఇకపై కేంద్రానికి ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించాల్సి రానుంది. లేదా ప్రభుత్వ షేర్లను బైబ్యాక్ అయినా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియంతటినీ పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కింద కొత్తగా పేరు మారిన డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం పర్యవేక్షించనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ విషయాలు తెలిపారు. పుష్కలంగా నిధులు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) .. విస్తరణ ప్రణాళికలేమీ లేకపోతే ఆ నిధులను డివిడెండుగా చెల్లించేందుకో లేదా ప్రభుత్వ వాటాలను కొనుగోలు చేయడానికో వెచ్చించాలని దాస్ సూచించారు. మార్కెట్ విలువను రాబట్టేలా లిస్టింగ్‌కు అర్హమైన పీఎస్‌యూలను ఎంపిక చేసే బాధ్యతను దీపంనకు అప్పగించనున్నట్లు ఆయన వివరించారు.