పసిడి సంగతి తేలేది కొత్త ఏడాదే!?
న్యూయార్క్/ముంబై: అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పావు శాతం పెరిగి 0.50 శాతానికి చేరిన వెంటనే అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ఆరేళ్ల కనిష్ట స్థాయి ఔన్స్ (31.1గ్రా) 1,050 డాలర్లకు పడిపోయింది. అయితే అప్పటి నుంచీ పసిడి ధర క్రమంగా పెరుగుతూ తిరిగి దాదాపు 1,080 డాలర్లకు ఎగసింది. ఇకముందు పరిస్థితి ఏమిటన్నది ప్రస్తుతం నిపుణుల ముందు పెద్ద ప్రశ్నగా ఉంది. మెజారిటీ అభిప్రాయం చూస్తే... రానున్న 15 రోజుల కాలంలో ధర దాదాపు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతుంది.
ఈ విలువైన మెటల్ పయనం వెనక్కా... లేదా ముందుకా అన్నది తేలేది వచ్చే ఏడాదేనని ఈ రంగంలో నిపుణుడు, ఆర్‌జేఓ ఫ్యూచర్స్‌లో నిపుణుడు బోబ్ బాబర్‌కోర్న్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగిస్తే... పసిడి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారుతుందని ఆయన అంచనా. అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగిస్తే.. డాలర్ విలువ పడిపోయే అవకాశం ఉందని, ఇదే జరిగితే మూడేళ్లుగా నత్తనడక నడుస్తున్న పసిడి పరుగు ప్రారంభమయ్యే వీలుందని క్రెడిట్ సూచీ అభిప్రాయపడింది. ఆయా పరిస్థితుల్లో పసిడి 1,100 డాలర్ల నుంచి 1,150 డాలర్ల మధ్య శ్రేణిలో కదలాడే వీలుందని అభిప్రాయపడింది.
దేశీయంగా మళ్లీ పైకి...: ఇక దేశీయంగా చూస్తే... వారం వారీగా పసిడి 99.5 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ.260 ఎగసి రూ.25,195 వద్ద ముగిసింది. 99.9 ప్యూరిటీ ధర కూడా ఇంతే మొత్తం ఎగసి 25,345 వద్ద ముగిసింది. ఇక వెండి ధర కేజీకి భారీగా రూ.940 ఎగసి రూ.34,460కి చేరింది. దిగువ స్థాయి ధరల వద్ద స్టాకిస్టులు, వర్తకుల నుంచి కొనుగోళ్ల డిమాండ్ దీనికి ప్రధాన కారణం.