సెల్‌ఫోన్లలో ‘స్మార్ట్’ లీడర్లు!
► 2018 నాటికి ఫోన్లలో వీటిదే 62శాతం
► రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ అంచనా
ముంబై: స్మార్ట్‌ఫోన్ల జోరు కొనసాగుతోంది. 2018 నాటికి దేశంలోని మొత్తం మొబైల్ హ్యాండ్‌సెట్స్ విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లు 62 శాతం వాటా ఆక్రమిస్తాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ అంచనా వేసింది. దీనికి ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం, స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ పెరుగుదల వంటి పలు అంశాలు కారణంగా నిలుస్తాయని పేర్కొంది. ఇండియన్ సెల్యులర్ మార్కెట్ స్థిరీకరణ దిశగా పయనించడం, 4జీ నెట్‌వర్క్ విస్తరణ వల్ల స్మార్ట్‌ఫోన్ల డిమాండ్ అలాగే కొనసాగుతుందని తెలిపింది.
శాంసంగ్, యాపిల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఇండియన్ మార్కెట్‌లో వాటి వాటాను పెంచుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయని పేర్కొంది. ఇక జియోనీ, హువావే, ఒప్పొ, వివో, షావోమి, లెనొవొ వంటి చైనా కంపెనీలు ఇక్కడి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అధిక మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్లకు సిద్ధమయ్యాయని వివరించింది. మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ల కోసం కస్టమర్లు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని పేర్కొంది.