ఓటీటీ దిగ్గజంగా భారత్‌ | Video OTT market in India to be among global top 10 by 2020 | Sakshi
Sakshi News home page

ఓటీటీ దిగ్గజంగా భారత్‌

Published Fri, May 10 2019 5:52 AM | Last Updated on Fri, May 10 2019 5:52 AM

Video OTT market in India to be among global top 10 by 2020 - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ దేశీ వీడియో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) మార్కెట్‌ 2022 నాటికి అంతర్జాతీయంగా టాప్‌ 10 మార్కెట్లలో ఒకటిగా ఎదగనుంది. అప్పటికి భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ పరిమాణం 823 మిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 5,363 కోట్లు) చేరనుంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారత వీడియో ఓటీటీ మార్కెట్‌ ప్రస్తుతం శైశవ దశలో ఉంది. అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ వృద్ధి బాటలో సాగుతోంది. 2017–2022 మధ్య కాలంలో ఈ మార్కెట్‌ వార్షిక ప్రాతిపదికన 22.6% వృద్ధి నమోదు చేయనుంది. ఇదే వ్యవధిలో 10.1 శాతం వృద్ధితో అంతర్జాతీయ వీడియో ఓటీటీ మార్కెట్లకు సంబంధించి టాప్‌ 10లో ఒకటిగా నిలుస్తుంది‘ అని నివేదిక పేర్కొంది. దేశీయంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు ఓటీటీ సేవలు అందిస్తున్నాయి.

పలు అంశాల ఊతం..
దేశీయంగా ఓటీటీ మార్కెట్‌ వృద్ధికి పలు అంశాలు దోహదపడనున్నాయి. నిరంతరాయ కనెక్టివిటీ, కంటెంట్‌ వినియోగానికి మొబైల్‌ సాధనాలను ఎక్కువగా ఉపయోగించడం పెరుగుతుండటం, కస్టమరు వ్యక్తిగత అభిరుచులకు అనుగుణమైన కంటెంట్‌ను అందించే వీలు ఉండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి. మరోవైపు 2022 నాటికి స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య 12.9% వార్షిక వృద్ధి రేటుతో 85.9 కోట్లకు చేరుతుందనేది నివేదిక అంచనా. 2017లో వీరి సంఖ్య 46.8 కోట్లు.

వీవోడీకు స్మార్ట్‌ఫోన్స్‌ తోడ్పాటు..
డేటా టారిఫ్‌లు భారీగా తగ్గిపోవడం, స్మార్ట్‌ఫోన్స్‌ వినియోగం పెరుగుతుండటంతో ప్రధానంగా వీడియో ఆన్‌ డిమాండ్‌ (వీవోడీ) మార్కెట్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొంది. ‘భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌ వీడియోలను వీక్షించేందుకు అనువైన డివైజ్‌ల లభ్యత పెరుగుతుండటం వీవోడీ పరిశ్రమకు తోడ్పడుతుంది. కంటెంట్‌ వినియోగం ఎక్కువగా స్మార్ట్‌ఫోన్స్‌తోనే జరుగుతోంది‘ అని నివేదిక వివరించింది. స్మార్ట్‌ ఫోన్స్‌ కాకుండా ట్యాబ్లెట్స్‌ కూడా వీవోడీ పరిశ్రమకు కీలకంగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్స్‌తో పోలిస్తే హెచ్‌డీ కంటెంట్‌ చూడటానికి ట్యాబ్లెట్స్‌ అనువుగా ఉంటాయని అసోచాం–పీడబ్ల్యూసీ అధ్యయనం తెలిపింది. వినోద, మీడియా పరిశ్రమలో టీవీ అతి పెద్ద ప్రధాన విభాగమని, భవిష్యత్‌లోనూ అలాగే కొనసాగుతుందని వివరించింది. 2017–2022 మధ్య కాలంలో భారత టెలివిజన్‌ పరిశ్రమ 10.6 శాతం వార్షిక వృద్ధితో 13.3 బిలియన్‌ డాలర్ల నుంచి 22 బిలియన్‌ డాలర్లకు చెందుతుందని నివేదిక పేర్కొంది. ఇదే వ్యవధిలో అంతర్జాతీయంగా టీవీ పరిశ్రమ వృద్ధి సగటు అత్యంత తక్కువగా 1.4 శాతంగా మాత్రమే ఉండగలదని వివరించింది. ‘కంటెంట్‌ పరిశ్రమలో పెను మార్పులు వస్తున్నప్పటికీ భారత్‌లో సంప్రదాయ వినోద సాధనాల ఆధిపత్యమే కొనసాగుతుందని దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యం త చౌకగా కంటెంట్‌ను వినియోగించుకోవడానికి అనువైన సాధనాల్లో టీవీ ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో వినోదానికి ఇదే ప్రధాన వనరుగా ఉంటోంది‘‡అని నివేదిక వివరించింది.

50 కోట్లకు ఆన్‌లైన్‌ వీడియో వీక్షకులు: గూగుల్‌
2020 నాటికి భారత్‌లో ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఒక నివేదికలో వెల్లడించింది. భారతీయ వినియోగదారులు సమాచారాన్ని సేకరించుకోవడాన్ని, కొనుగోళ్లపై నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆన్‌లైన్‌ వీడియోలు గణనీయంగా మారుస్తున్నాయని వివరించింది. భారతీయులు సెర్చి చేసే కంటెంట్‌పై బ్రాండ్స్‌కు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి రూపొందించిన నివేదిక ప్రకారం.. ఆన్‌లైన్‌ వీడియో సెర్చిలో మూడింట ఒక వంతు వినోద సంబంధమైనవే అంశాలే ఉంటున్నాయి.  లైఫ్‌ స్టయిల్, విద్య, వ్యాపారం వంటి అంశాలు గత రెండేళ్లలో 1.5 నుంచి 3 రెట్లు దాకా వృద్ధి నమోదు చేశాయి. కార్ల కొనుగోళ్ల నిర్ణయాలను ఆన్‌లైన్‌ వీడియో గణనీయంగా ప్రభావితం చేస్తోంది. కొనుగోలు చేసే కారుపై అధ్యయనం చేసేందుకు కార్ల కొనుగోలుదారుల్లో 80 శాతం మంది ఇదే మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి పది మంది కొత్త ఇంటర్నెట్‌ యూజర్లలో తొమ్మిది మంది భారతీయ ప్రాంతీయ భాషా కంటెంట్‌ను ఉపయోగిస్తున్నారు. గూగుల్‌ నివేదికలోని మరికొన్ని విశేషాలు..

► ఏటా 4 కోట్ల మంది భారతీయులు కొత్తగా ఇంటర్నెట్‌ వినియోగదారులుగా మారుతు న్నారు. ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి భారత్‌లోనే ఉంటోంది.
► దేశీయంగా ప్రతీ యూజరు సగటున నెలకు 8 జీబీ మొబైల్‌ డేటాను వినియోగిస్తున్నారు. సంపన్న దేశాల్లో వినియోగానికి ఇది సరిసమానం.
► ఆన్‌లైన్‌ సెర్చి విషయంలో ప్రస్తుతం మెట్రోయేతర ప్రాంతాలు .. మెట్రో నగరాలను మించుతున్నాయి. మెట్రో నగరాలతో పోలిస్తే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా బీమా, సౌందర్యం, పర్యాటకం వంటి అంశాల గురించి సమాచారం కోసం సెర్చి చేస్తున్నారు. గూగుల్‌ ప్లాట్‌ఫాంపై నమోదయ్యే బ్యాంకింగ్, ఆర్థిక, బీమా సేవలకు సంబంధించిన సమాచార సేకరణలో 61 శాతం భాగం మెట్రోయేతర ప్రాంతాల నుంచే ఉంటోంది. వాహనాలకు సంబంధించి ఇది 55 శాతంగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement