న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా తమకు కీలకమైన మార్కెట్లలో భారత్ కూడా ఒకటని సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్య దేవనాథన్ తెలిపారు. దేశీయంగా రీల్స్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాధనాలకు గణనీయంగా ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తి రీల్స్‌కి ఉందని గుర్తించిన బ్రాండ్లు, కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు తమ ప్రచార కార్యక్రమాల్లో వాటిని తొలినాళ్ల నుంచే వినియోగించడం ప్రారంభించాయని సంధ్య చెప్పారు. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఓనమ్ వరకు వివిధ అంశాల గురించి సమాచారం కోసం భారతీయ యూజర్లు ఏఐ ఆధారిత చాట్‌బాట్ వైపు మళ్లుతున్నారని వివరించారు.
ఈ నేపథ్యంలో దేశీయంగా వ్యాపారావకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మరింతగా పెట్టుబడులు పెట్టడాన్ని కంపెనీ కొనసాగిస్తుందని ఆమె చెప్పారు. జెన్ జడ్, యువ జనాభా, ప్రైవేట్ రంగం పుంజుకోవడం, పటిష్టమైన వృద్ధి అవకాశాలు, నవకల్పనలు, స్టార్టప్ వ్యవస్థ, పటిష్టమైన క్యాపిటల్ మార్కెట్లు మొదలైనవి భారత మార్కెట్‌కి సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
పరిశ్రమ వర్గాల్లోనూ ఆశాభావం నెలకొందని సంధ్య వివరించారు. ఇవన్నీ కూడా భారత్ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దాఖలాలను సూచిస్తున్నాయన్నారు. వాస్తవానికి చాలాకాలం క్రితమే దేశానికి ఈ హోదా దక్కాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment