ప్యాసింజర్ వాహనాలకు (పీవీ) సంబంధించి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్‌గా భారత్ ఎదిగింది. స్పోర్ట్ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) వాటా ఇందులో దాదాపు సగం స్థాయిలో ఉంటోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 43 లక్షల యూనిట్లుగా ఉన్న పీవీల మార్కెట్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి అరవై లక్షలకు చేరొచ్చని, ఇందులో 20–21 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదే (ఈవీ) ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాహనాల డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం, పర్యావరణ అనుకూల కొత్త టెక్నాలజీలను వినియోగంలోకి తేవడంపై ఆటోమొబైల్ కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఇందుకోసం దాదాపు రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
ఈవీలు, ఐసీఈలపై మారుతీ కసరత్తు..
మారుతీ సుజుకీ ఎస్‌యూవీ కేటగిరీలో తొలి ఈవీని గతేడాదే ఆవిష్కరించనున్నట్లు తొలుత ప్రకటించినా అది ఈ ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడింది. 2029–30 నాటికి మొత్తం ఆరు ఈవీలను భారత్‌లో ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 50 శాతం మార్కెట్ వాటాను తిరిగి దక్కించుకునే క్రమంలో సామర్థ్యాల పెంపు, కొత్త మోడళ్ల అభివృద్ధి మొదలైన వాటిపై 2024–25లో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో సి ంహభాగం వాటా హరియాణా నాలోని ఖార్ఖోడా ప్లాంటుపైనే వెచ్చించనుంది. 2025 నాటికి ఇందులో ఉత్పత్తి ప్రారంభం కానుండగా, సంస్థకు ఏటా 2,50,000 యూనిట్ల ఉత్పత్తి సామర్ధ్యం జత కానుంది. ఎంఎస్‌ఐఎల్ ప్రస్తుతం గురుగ్రామ్, మానెసర్, హన్సల్‌పూర్ (గుజరాత్) ప్లాంట్లలో ఏటా 23.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు, మోడళ్ల శ్రేణిని 28కి పెంచుకునేందుకు 2030–31 నాటికి రూ. 1.25 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.
టాటా మోటార్స్ 6 ఈవీలు...
టాటా మోటార్స్ 2030 ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీలపై రూ. 16,000–18,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం నాలుగు ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ విక్రయిస్తున్న కంపెనీ 2026 మార్చి నాటికి మరో ఆరు ఈవీలను ఆవిష్కరించాలని నిర్దేశించుకుంది. 2030 నాటికి పీవీ మార్కెట్లో 20 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది.
ఎంఅండ్‌ఎం రూ. 12,000 కోట్లు..
ఈవీల విభాగం మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్‌పై వచ్చే మూడేళ్లలో రూ. 12,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనకు ఎంఅండ్‌ఎం బోర్డు ఆమోదముద్ర వేసింది. 2025 తొలి త్రైమాసికంలో కంపెనీ తమ తొలి ‘బార్న్ ఈవీ’ శ్రేణిని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. 2027 నాటికి ఎంఅండ్‌ఎం అమ్మకాల్లో ఈవీల వాటా 20–30% ఉంటుందని అంచనా. 2030 నాటికి తొమ్మిది ఎస్‌యూవీలను, ఏడు బార్న్ ఎలక్ట్రిక్ వాహనాలను, ఏడు తేలికపాటి వాణిజ్య వాహనాలను ప్రవేశపెట్టేందుకు 2024–25 నుంచి 2026–27 మధ్య కాలంలో రూ. 27,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ గతంలో తెలిపింది. ఇందులో ఐసీఈ వాహనాల కోసం రూ. 8,500 కోట్లు వెచ్చించనుంది.
హ్యుందాయ్.. సై..
త్వరలో భారీ పబ్లిక్ ఇష్యూకి వస్తున్న కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వచ్చే 10 ఏళ్లలో రూ. 32,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. తమిళనాడు ప్లాంటు సామర్థ్యాల పెంపు, విడిభాగాల వ్యవస్థ, ఈవీల తయారీ, చార్జింగ్ మౌలిక సదుపాయాలు మొదలైన వాటిపై రూ. 26,000 కోట్లు, జనరల్ మోటార్స్ నుంచి కొనుగోలు చేసిన తాలేగావ్ ప్లాంటుపై రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
లిస్టులో మరిన్ని కంపెనీలు..
» జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కొత్త తరహా ఎనర్జీ వాహనాలను (ఎన్‌ఈవీ), ఐసీఈ వాహనాలను అభివృద్ధి చేసేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉంది.
» కియా ఇండియా 2025లో ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం రూపొందించిన ఈవీని ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది.
» ఆరు వాహనాల అభివృద్ధి కోసం భారత్‌లో రూ. 5,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు నిస్సాన్, రెనో గతేడాది ప్రకటించాయి. వీటిలో రెండు ఈవీలు కూడా ఉండనున్నాయి.
» ఇక ద్విచక్ర వాహనాలు, ఈవీల కోసం అవసరమయ్యే పరికరాల ఉత్పత్తి కోసం విడిభాగాల తయారీ సంస్థలు వచ్చే మూడు–నాలుగేళ్లలో రూ. 25,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఇందులో 45–50 శాతం మొత్తాన్ని బ్యాటరీ సెల్స్ తయారీపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment