మాల్యాకు రూ.100కోట్ల షాక్
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇటీవల మాల్యాను ఇండియాకు తిరిగి రప్పించే చర్యలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా మరో కీలక చర్య తీసుకుంది. మాల్యాకు చెంఇన సుమారు రూ.100కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్రానికి బదిలీచేసింది.
ముఖ్యంగా యునైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన ఆస్తులపై దృష్టిపెట్టిన ఈడీ తాజాగా మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువైన వాటాలను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీల్) కు చెందిన రూ. 100 కోట్ల విలువైన ( ప్రత్యక్ష, పరోక్ష)వాటాల హక్కులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. మనీలాండర్ చట్టం సెక్షన్9 ప్రకారం ఈ ఆస్తుల బదిలీ ప్రక్రియను చేపట్టింది.
మరోవైపు ఈడీ ఇప్పటికే యూబీఎల్‌కు చెందిన 4 కోట్ల వాటాలు, యూఎస్‌ఎల్‌కు చెందిన 25.1లక్షల వాటాలు, మెక్‌డోవెల్స్ హోల్డింగ్స్‌లోని 22 లక్షల వాటాలను అటాచ్ చేసింది. వీటితోపాటు మాల్యావిగా అనుమానిస్తున్న మరికొన్ని కంపెనీలపై దృష్టి సారించింది. వీటిల్లో దేవీ ఇన్వెస్ట్‌మెంట్స్, కింగ్‌ఫిషర్ ఫిన్‌వెస్ట్ ఇండియా, మాల్యా ప్రైవేటు లిమిటెడ్, ఫార్మాట్రేడింగ్ కంపెనీ, విట్టల్ ఇన్వెస్ట్‌మెంట్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్, కామ్‌స్కో ఇండస్ట్రీస్, ‘ది గెమ్’ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీలపై కూడా దృష్టిపెట్టింది.
రెండునెలల క్రితం యూబీఎల్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) మాక్టోవెల్ హోల్డింగ్స్ లిమిటెడ్లో మాల్యా, అతని అనుబంధ సంస్థలకు చెందిన రూ. 4వేల కోట్ల వాటాలను బదిలీ చేయాల్సిందిగా ఎస్‌హెచ్‌సీఐఎల్‌కు ఈడీ లేఖరాసింది. ఈ మేరకు ఫిబ్రవరిలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్డర్ రూ .4,200 కోట్ల ఆస్తుల ఎటాచ్‌మెంట్ ఆర్డర్‌ను కోర్టు సమ్మతించింది. ఈ కంపెనీల్లో మాల్యాకు రూ.4,000 కోట్ల విలువైన షేర్లు ఉంటాయని అంచనా. అలాగే గత ఏడాది సెప్టెంబర్లో ఈడీ రూ .6,630 కోట్ల విలువైన అటాట చేసిన సంగతి తెలిసిందే. మనీ లావాదేవీ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) నిబంధనలో 9 వ సెక్షన్ కింద, జప్తు ఆర్డర్ తర్వాత, అటువంటి ఆస్తిలో అన్ని హక్కులు కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయి.