
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసాల వివాదం మరింతగా ముదిరితే భారత్, అమెరికా రెండు దేశాల ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. అమెరికన్ ఉద్యోగాలను కాపాడే పేరుతో... విదేశీయుల హెచ్–1బీ వీసాల గడువు పొడిగించకుండా కొత్త నిబంధన చేర్చేందుకు అమెరికా కసరత్తు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన పక్షంలో గ్రీన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న పది లక్షల మంది పైగా హెచ్–1బీ వీసా హోల్డర్లను కూడా (ఇందులో సింహభాగం భారతీయులే ఉన్నారు) వారి వారి స్వదేశాలకు పంపించేసే అవకాశం ఉంది. ‘ఇలాంటి పరిణామం కేవలం భారతీయ ఐటీ పరిశ్రమకే కాకుండా హెచ్–1బీ వీసాలనను ఉపయోగించే భారతీయులందరిపైనా ప్రభావం చూపుతుంది.
అమెరికాలో అసలు సమస్యల్లా.. సుశిక్షితులైన నిపుణులు తగినంత మంది దొరక్కపోవడమే. ఈ పరిస్థితుల్లో వీసాలపరంగా ఏ ప్రతికూల నిర్ణయం తీసుకున్నా అది ఇటు భారత్, అటు అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది‘ అని చంద్రశేఖర్ చెప్పారు. వీసా నిబంధనల్లో మార్పులతో భారత ఐటీ కంపెనీల వ్యయాలు ఏటా 5–10 శాతం మేర పెరిగిపోయే అవకాశం ఉందని గ్రేహౌండ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, చీఫ్ అనలిస్ట్ సంచిత్ వీర్ గోగియా పేర్కొన్నారు. మరోవైపు, మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా మాత్రం వీసాల వివాద తీవ్రతను కాస్త తగ్గించే ప్రయత్నం చేశారు. వీసాల వివాదం కారణంగా తిరిగివచ్చే వారందరికీ తాను స్వాగతం పలుకుతానని, భారత వృద్ధికి తమ వంతు కృషి చేసేందుకు వారు సరైన సమయంలో తిరిగొచ్చినట్లు అవుతుందని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment