
న్యూఢిల్లీ: ఇప్పటికే భారీ స్టోర్ల ద్వారా దేశ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన వాల్‌మార్ట్... ఆన్‌లైన్‌లోనూ సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ మార్గాన్ని ఎంచుకుంది. అంటే... ఫ్లిప్‌కార్ట్‌లో 15 నుంచి 20 శాతం వాటా కొనుగోలు చేయటం ద్వారా భారత ఆన్‌లైన్ మార్కెట్లోకి ప్రవేశించటమన్న మాట. దీనికోసం సుమారు 1 బిలియన్ డాలర్ల వరకూ ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇరు సంస్థలూ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. ఇటీవలే భారత పర్యటనకి వచ్చిన వాల్‌మార్ట్ గ్లోబల్ సీఈవో డగ్ మెక్‌మిలన్.. బెంగళూరులోని ఫ్లిప్‌కార్ట్ కార్యాలయంలో కొంతసేపు గడిపారని కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘భారత మార్కెట్‌కి వాల్‌మార్ట్ చాలా ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే మా గ్లోబల్ సీఈవో డగ్ మెక్‌మిలన్ ఇక్కడి మూడు వ్యాపార విభాగాలను (క్యాష్ అండ్ క్యారీ, గ్లోబల్ టెక్నాలజీ సెంటర్, గ్లోబల్ సోర్సింగ్) సమీక్షించేందుకు ఈ మధ్య భారత్ వచ్చారు. భారత మార్కెట్‌కి మేం కట్టుబడి ఉన్నాం‘ అని వాల్‌మార్ట్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌తో డీల్‌కు సంబంధించి మార్కెట్ వర్గాల ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించబోమన్నారు.
మరింత బలపడనున్న ఫ్లిప్‌కార్ట్: ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టిన పక్షంలో భారీ భారత ఈ–కామర్స్ వ్యాపారంలో వాల్‌మార్ట్‌కూ వాటా దక్కినట్లవుతుంది. దేశీ ఈ– కామర్స్ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరం 33 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా. మరోవైపు, ఇప్పటికే సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులున్న ఫ్లిప్‌కార్ట్‌కి వాల్‌మార్ట్ కూడా తోడైతే... ఆర్థికంగా మరింత బలపడుతుంది. అలాగే, వ్యాపార విభాగాలూ పటిష్ఠమవుతాయి. అమెరికన్ దిగ్గజం అమెజాన్‌కి దీటుగా పోటీనివ్వగలదు. ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఇరు కంపెనీలు ఇప్పటికే బిలియన్ల డాలర్లు మార్కెట్లో కుమ్మరిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 4 బిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ఇందులో సాఫ్ట్‌బ్యాంక్ 2.5 బిలియన్ డాలర్లు.. టెన్సెంట్, మైక్రోసాఫ్ట్, ఈబే 1.4 బిలియన్ డాలర్లు అందించాయి.