
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరి రియల్టీ నివాస, వాణిజ్య, కార్యాలయాల విభాగాల్లోనే కాదండోయ్.. గిడ్డంగుల్లోనూ దూసుకెళుతోంది. 2016లో 12 లక్షల చ.అ. గిడ్డంగుల లావాదేవీలు జరగ్గా.. 2017 ముగింపు నాటికది 68 శాతం వృద్ధి రేటుతో 25 లక్షల చ.అ.లకు చేరింది. ఫార్మా, ఈ–కామర్స్, లాజిస్టిక్ రంగాల భాగస్వామ్యమే ఇందుకు కారణమని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఆయా లావాదేవీల్లో సింహభాగం జీడిమెట్ల – మేడ్చల్ క్లస్టర్‌లోనే కేంద్రీకృతమయ్యాయని పేర్కొంది.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్‌ఐఐసీ) జీడిమెట్ల, కరీంనగర్, పటాన్‌చెరు, శంషాబాద్ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్క్‌లను ఏర్పాటు చేసింది. జీడిమెట్ల–మేడ్చల్ వేర్‌హౌజ్ క్లస్టర్ ప్రధానంగా ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమలకు పెట్టింది పేరు. ప్రధాన నగరానికి అనుసంధానం కావటంతో పాటూ నాగర్‌పూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారిలకు అనుసంధానంగా ఉండటం ప్రధాన కారణం. 2017లో ప్రధానంగా ఫ్లిప్‌కార్ట్, డీహెచ్‌ఎల్, డెల్హివరీ, నెస్లే వంటి సంస్థలు గిడ్డంగుల ఏర్పాటు కోసం స్థలాలను లీజుకు తీసుకున్నాయని నైట్‌ఫ్రాంక్ నివేదిక తెలిపింది.
అద్దె నెలకు రూ.12..
నగరంలో జీడిమెట్ల, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ కొంపల్లి, బౌరంపేట, గాజులరామారం, మేడ్చల్, తుర్కపల్లి ప్రాంతాల్లో వేర్‌హౌజ్ కేంద్రాలున్నాయి. సత్యనారాయణ గోడౌన్స్, డీఆర్‌ఎస్ లాజిస్టిక్స్, జీరో మైల్ వేర్‌హౌజింగ్, దుర్గేష్ గోడౌన్స్, విట్టల్ రెడ్డి గోడౌన్స్ ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. జీడిమెట్లలో వేర్‌హౌజ్ స్థలాల ధరలు ఎకరానికి 3 కోట్ల నుంచి 5 కోట్లు, తుర్కపల్లిలో 15–30 లక్షల వరకున్నాయి. స్థలాల అద్దెలు నెలకు చ.అ.కు రూ.12 నుంచి 18 వరకున్నాయి.
గిడ్డంగుల్లో రూ.22,100 కోట్ల పెట్టుబడులు!
హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణె, ఎన్‌సీఆర్, చెన్నై, ముంబై, బెంగళూరు నగరాల్లో 2016లో 13.9 మిలియన్ చ.అ. గిడ్డంగుల లావాదేవీలు జరగ్గా.. 2017 నాటికిది 85 శాతం వృద్ధి రేటుతో 25.7 మిలియన్ చ.అ.లకు చేరింది. తయారీ రంగం, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, రిటైల్ రంగం వృద్ధి చెందడమే ఇందుకు ప్రధాన కారణం.
2014 జనవరి నుంచి 2018 జనవరి వరకు రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చిన ప్రైవేట్ ఈక్విటీ (పీఈ), సంస్థాగత పెట్టుబడుల్లో 26 శాతం గిడ్డంగుల విభాగంలోకే వచ్చాయి. నాలుగేళ్లలో ఇందులోకి రూ.22,100 కోట్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. విభాగాల వారీగా లావాదేవీలు గణాంకాలను పరిశీలిస్తే.. తయారీ రంగం 30 శాతం, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ 29 శాతం, రిటైల్‌లో 16 శాతం లావాదేవీలు జరిగాయి. నగరాల వారీగా జాబితాను పరిశీలిస్తే.. ఎన్‌సీఆర్‌లో 6.5 మిలియన్ చ.అ. లావాదేవీలు జరిగాయి. 2016తో పోలిస్తే ఇది 129 శాతం వృద్ధి. ముంబైలో 5.2 మిలియన్ చ.అ., 2016తో పోలిస్తే ఇది 231 శాతం వృద్ధి. బెంగళూరులో 90 శాతం, అహ్మదాబాద్‌లో 86 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
2017లో నగరాల వారీగా వేర్‌హౌజ్ స్థల లావాదేవీలు: (మిలియన్ చ.అ.)
నగరం 2016 2017
హైదరాబాద్ 1.2 2.5
అహ్మదాబాద్ 1.7 3.3
కోల్‌కతా 1.4 1.6
పుణె 2 2.5
ఎన్‌సీఆర్ 2.8 6.5
చెన్నై 1.9 2.4
ముంబై 1.6 5.2
బెంగళూరు 1.3 2.5
మొత్తం 13.9 25.7
Comments
Please login to add a commentAdd a comment