
షేర్లవైపూ చూడండి..!
♦ ద్రవ్యోల్బణానికి తగ్గ రాబడి అక్కడే వస్తుంది
♦ జీవిత బీమాకు యూలిప్ పాలసీలు చాలవు
♦ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగో సూచనలు
నేనో ప్రభుత్వోద్యోగిని. వయస్సు 46 సంవత్సరాలు. నెల వేతనం రూ.50,000. నేను రిటైరవడానికి మరో పన్నెండేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం సొంతంగా ఇండిపెండెంట్ హౌస్, ఒక డబుల్ బెడ్రూం అపార్ట్‌మెంట్ ఉన్నాయి. ఈ ఏడాది ఆఖరుకి ఇంటి మీద మరో ఫ్లోర్ వేయాలనుకుంటున్నాను. ఇందుకోసం రూ.4 లక్షలు పొదుపు చేశాను. బ్యాంకు నుంచి మరో రూ.5 లక్షలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇలా తీసుకున్న హౌసింగ్ లోన్ మీద వడ్డీకి సంబంధించి డిడక్షన్ క్లెయిమ్ చేసుకునే వీలుందా?
పెట్టుబడుల విషయానికొస్తే, నెలకు రూ.4,000 ఫండ్స్‌లో (సిప్ మార్గంలో), మరో రూ.1,000 ఎస్‌బీఐ చిల్డ్రన్ యులిప్ పాలసీకి, పోస్టల్ ఆర్‌డీ కింద రూ. 3,500 కడుతున్నాను. ఎంఐఎస్ ఫండ్‌లో రూ.4 లక్షలు, ఎఫ్‌డీలో మరో రూ.6 లక్షలు ఉన్నాయి. ఎల్‌ఐసీ మనీ బ్యాంక్ పాలసీ నుంచి రూ.1 లక్ష వస్తుంది. ఎస్‌బీఐ స్మార్ట్ పర్ఫార్మర్‌లో అయిదేళ్ల పాటు రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ప్రస్తుతం దాని విలువ రూ.3 లక్షలు. ఈ ఏడాది అటు ఎస్‌బీఐ వెల్త్ బిల్డింగ్‌లో రూ.50,000 పెట్టుబడి పెట్టాను. లక్ష్యాలకు సంబంధించి మా అబ్బాయికి ప్రస్తుతం 14 సంవత్సరాలు. తన చదువుకు తగినంత నిధి, నా రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం రూ.40 లక్షల మేర ఫండ్‌ను సమకూర్చుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలు చేయగలరు.
అశోక్ గారు,
మీరిచ్చిన వివరాలు పరిమితంగానే ఉన్నాయి. వాటికి అనుగుణంగా సూచనలిస్తున్నాను. ఇంటి రుణం మీద చెల్లించే అసలు, వడ్డీకి సెక్షన్ 80సీ, సెక్షన్ 24ల కింద డిడక్షన్ పొందవచ్చు. పోస్టల్ రికరింగ్ డిపాజిట్ల మీద ప్రస్తుతం 7.4% మేర వడ్డీ లభిస్తోంది. యులిప్ పాల సీలతో తగినంత జీవిత బీమా కవరేజి లభించదు. అలాగే, రాబడులు కూడా మీ అవసరాలకు అనుగుణంగా లభించకపోవచ్చు. కాబట్టి.. వీటి కాలవ్యవధి తీరిన తర్వాత వీలయితే డిస్‌కంటిన్యూ చేయొచ్చు.
ఈక్విటీవైపు చూడండి...
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే .. మీ పోర్ట్‌ఫోలియో ఎక్కువగా రియల్టీ, డెట్‌లోనే కేంద్రీకృతమై ఉంది. మీ అబ్బాయి చదువుకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోవాలంటే ఈక్విటీల్లో పెట్టుబడులు మరికాస్త మెరుగైన రాబడులందించే అవకాశముంది. మీరు ఎంత నిధి సమకూర్చుకోవాలనుకుంటున్నారన్నది తెలియరాలేదు. కాకపోతే దాదాపు 12 సంవత్సరాల వ్యవధి ఉన్నందున.. ఈక్విటీ మార్కె ట్ల హెచ్చుతగ్గుల రిస్కుల ప్రభావాలు మీ పెట్టుబడులపై తక్కువగానే ఉండగలవు. ఎల్‌ఐసీ నుంచి వచ్చిన డబ్బును, ఆర్‌డీ..యులిప్‌ల ద్వారా వచ్చిన డబ్బుతో ఈక్విటీ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) పద్ధతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అబ్బాయి చదువు కోసం వీలయినంత ఎక్కువగా పెట్టుబడికి కేటాయించవచ్చు.
రూ.40 లక్షలు చాలవేమో!!
రిటైర్మెంట్ నాటికి రూ. 40 లక్షల దాకానైనా ఉండాలనుకుంటున్నారు. ఇది పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం మీ దగ్గర రూ. 16.3 లక్షల మేర ఉన్నాయి (రికరింగ్ డిపాజిట్లు, యులిప్‌ల ప్రస్తుత విలువ తెలియనందున వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే), అలాగే సిప్ మార్గంలో నెలకు చేసే రూ. 5,000 (ఆర్‌డీ, యులిప్ నిధులు మళ్లించాకా చేసే ఇన్వెస్ట్‌మెంట్) పెట్టుబడులు సురక్షితంగా 8 శాతం రాబడినైనా ఇస్తాయి. అయితే, మీరు ఇక్కడ ధరల పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణం 5 శాతంగా వేసుకున్నా.. మీరు ఇప్పుడు రూ.40 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అప్పటికి రూ.72 లక్షలు అవసరమవుతాయి. ఇప్పటికే మీరు రూ. 4,000 సిప్ చేస్తున్నందున.. ఈ అదనపు మొత్తం సమకూర్చుకోవడానికి అది తోడ్పడుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి..
ఇక, ఇతరత్రా రిస్కుల నుంచి మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కలిగించే ందుకు కనీసం రూ. 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. 20 సంవత్సరాల టర్మ్ పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారు రూ. 11,000 ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అలాగే మరో రూ. 25 లక్షలకు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కూడా తీసుకోండి. దీనికి ఏటా దాదాపు రూ. 4,000 ప్రీమియం ఉంటుంది. వైద్య అవసరాల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనే భావిస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకోసం, మీ జీవిత భాగస్వామి కోసం పర్సనల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే.. రిటైర్మెంట్ తర్వాత అధిక ప్రీమియంలు కట్టాల్సిన అవసరం ఉండదు. తదుపరి కొన్నేళ్ల తర్వాత మీ పోర్ట్‌ఫోలియోను ఒకసారి పునఃసమీక్షించుకోండి. రిటైర్మెంట్‌కి దగ్గరయ్యే కొద్దీ పెట్టుబడులను క్రమంగా డెట్ సాధనాల వైపు మళ్లించండి. అయితే, పూర్తి స్థాయిలో ఫలితాలు లభించేందుకు మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి తగిన ఆర్థిక ప్రణాళికలు రూపొందిం చుకుని, పాటించడం శ్రేయస్కరం.
అనిల్ రెగో
ఫైనాన్షియల్ ప్లానర్ సీఈఓ, రైట్ హొరైజన్స్