అప్పుల ఊబిలోంచి రిలయన్స్‌ గట్టెక్కేనా? | we will be well in soon: anil ambani | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబిలోంచి రిలయన్స్‌ గట్టెక్కేనా?

Published Sun, Jun 4 2017 6:57 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

అప్పుల ఊబిలోంచి రిలయన్స్‌ గట్టెక్కేనా?

అప్పుల ఊబిలోంచి రిలయన్స్‌ గట్టెక్కేనా?

ముంబయి: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రుణ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కుతుందంటూ మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రశ్నకు ఆర్‌కామ్‌ అధినేత అనిల్‌ అంబానీ సమాధానం ఇచ్చారు. పక్కా ప్రణాళికతో తాము ముందుకు వెళ్తున్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మదుపర్లలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. సంస్థ ప్రణాళికను బ్యాంకర్లు, సంయుక్త రుణ సంస్థల ఫోరమ్‌లు అంగీకరించాయని, వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ నిబంధనలో భాగంగా రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు ఏడు నెలల గడువు లభించిందని వివరించారు. ఒకవేళ 2017 డిసెంబరులోపు చెల్లించకుంటేనే రుణాలను ఈక్విటీ కిందకు బ్యాంకులు మారుస్తాయని చెప్పారు.

అయితే ఈ పరిస్థితి అస్సలు రాదని ధీమా వ్యక్తం చేశారు. బ్రూక్‌ఫీల్డ్‌, ఎయిర్‌సెల్‌ లావాదేవీల ద్వారా వచ్చే 25వేల కోట్లతో సెప్టెంబరు కల్లా అప్పుభారం 20వేల కోట్లకి తగ్గుతుందని అనిల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌లో వాటాను విక్రయించడం ద్వారా ఆర్‌కామ్‌కు 11వేల కోట్లు వస్తాయి.

అలాగే ఆర్‌కామ్‌ వైర్‌లెస్‌ వ్యాపారాన్ని ఎయిర్‌సెల్‌లో విలీనం చేసి ఎయిర్‌కామ్‌ అనే కొత్త సంస్థను అనిల్‌ అంబానీ కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఈ లావాదేవీల వల్ల సుమారు 60 శాతం అప్పు తగ్గుతుందని ఆర్‌కామ్‌ భావిస్తోంది. మరికొంత రుణాన్ని తగ్గించుకునేందుకు విదేశాల్లోని వ్యాపారాల్లో వాటా విక్రయాన్ని కూడా సంస్థ పరిశీలిస్తోంది. డీటీహెచ్‌ వ్యాపారం, స్థిరాస్తులను విక్రయించే యోచనలో ఉన్నామని అనిల్‌ అంబాని తెలిపారు. రేటింగ్‌ ఏజెన్సీలు ఆర్‌కామ్‌ రేటింగ్‌ను తగ్గించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తిరిగి రేటింగ్‌ పెంచుకోవడంపై దృష్టి సారిస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement