జోరుగా ఎస్యూవీల అమ్మకాలు!
న్యూఢిల్లీ : స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ కు భారత్ లో ఫుల్ క్రేజ్ పెరుగుతోంది. డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఈ వెహికిల్స్ ఎక్కువగా అమ్మకాల జోరు కొనసాగించాయి. మార్చి 31 నాటికి వీటి అమ్మకాలు 6.25 శాతం పెరిగి 5.86 లక్షలుగా నమోదయ్యాయి. డిసెంబర్-మార్చి కాలంలో 12.69 శాతం అమ్మకాలు జరిగాయని భారత ఆటోమొబైల్ తయారీ సొసైటీ తెలిపింది. ఈ వెహికిల్స్‌లో వాడే ఇంధన విషయంలో సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఈ కార్లు ఎక్కువగా అమ్మకాలు నమోదవ్వడం విశేషం.
డిసెంబర్ నుంచి ఇంజన్ కెపాసిటీ 2000సీసీ కంటే ఎక్కువగా ఉన్న వాహనాలపై డిల్లీ- జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) లో నిషేధం కొనసాగుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో కార్ల కంపెనీలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. వాహనాల్లో వాడే ఇంధనం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని, కాలుష్యం పెరుగుందని పర్యావరణ వేత్తలు వాదిస్తున్నారు. తుది తీర్పు వచ్చే వరకూ ఈ నిషేధం ఇలానే కొనసాగుతుందని అపెక్స్ కోర్టు ఉత్తర్వులు కూడా జారీచేసింది. ఈ నెల 30వ తేదీ ఈ నిషేధంపై తుది విచారణ చేపట్టనున్నారు. కాగా, యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాల పెరుగుదల కోర్టు కేసులో ఏ మాత్రం ప్రభావం చూపదని పర్యావరణ వేత్తలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
మార్కెట్లో కొత్త గా ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ యుటిలిటీ కార్ల మోడళ్లు ఎక్కువగా అమ్మకాలు నమోదు చేస్తున్నాయి.ఇంజన్ సామర్థ్యం 2000 సీసీ కంటే తక్కువతో మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్ టీయూవి300, నూవో స్పోర్ట్, విటారా బ్రీజ్ కార్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. దీంతో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ అమ్మకాలు పెరిగాయని తెలుస్తోంది.