ముంబై : వాట్సాప్ ద్వారా కంపెనీ ఆర్థిక వ్యవహారాలు లీక్ చేసిన వ్యవహారంపై సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. రెండు డజన్లకు పైగా స్టాక్స్ ట్రేడ్ వివరాలపై విచారణ ప్రారంభించాయి. వాట్సాప్ ద్వారా పలు బ్లూచిప్‌కు చెందిన కంపెనీల ఆర్థిక వివరాలు లీకైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కంపెనీ స్టాక్స్ ట్రేడింగ్‌పై సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్‌లు విచారణకు దిగాయి. ఈ లీకేజీలో పాలు పంచుకున్న వ్యక్తుల కాల్ డేటా రికార్డులను కూడా రెగ్యులేటరీ, స్టాక్ ఎక్స్చేంజ్‌లను కోరుతున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో పలు బ్లూచిప్ కంపెనీలు ఉన్నట్టు ఈ విషయం తెలిసిన ఓ అధికారి చెప్పారు. ఈ కంపెనీలకు సంబంధించి గత 12 నెలల ట్రేడ్ డేటాను కూడా ఎక్స్చేంజ్‌లు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. డేటా వేర్‌హౌజ్, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ సాయాన్ని కూడా సెబీ తీసుకుంటున్నట్టు తెలిపారు.
సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల ఆర్థిక వివరాలు కేవలం స్టాక్ ఎక్స్చేంజ్‌ల ద్వారా మాత్రమే బయటికి వెళ్లాలి. ఈ డేటా చాలా సున్నితమైనది. ఈ వివరాలు స్టాక్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయి. కానీ వాట్సాప్ ద్వారా పలు బ్లూచిప్ కంపెనీల డేటా బహిర్గతమైనట్టు తెలుస్తోంది. అంతేకాక ఆర్థిక వ్యవహారాలు లీక్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కాల్ డేటా రికార్డులన్నీ కావాలని సెబీ ఆదేశించింది. డేటా అంతా ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ ద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోకి లీకైనట్టు తెలిసింది. వీరిపై కఠిన చర్యలకు కూడా సెబీ సిద్ధమైంది. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో పలు సార్లు సెబీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ లేకుండా పెట్టుబడుల సూచనదారులుగా వ్యవహరించిన పలు సంస్థలపై కూడా రెగ్యులేటరీ ఉక్కుపాదం మోపింది.
Comments
Please login to add a commentAdd a comment