వైట్ టాపింగ్ రోడ్డు పూర్తి | White topping road complete | Sakshi
Sakshi News home page

వైట్ టాపింగ్ రోడ్డు పూర్తి

Published Wed, Aug 19 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

వైట్ టాపింగ్ రోడ్డు పూర్తి

వైట్ టాపింగ్ రోడ్డు పూర్తి

మరిన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వానికి లేఖ.!
- సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్
- అసోసియేషన్ ప్రతినిధుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంక్రీట్ వైట్‌టాపింగ్ పద్ధతిలో రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నట్లు భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీందర్ రెడ్డి చెప్పారు. సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన కాంక్రీట్ వైట్‌టాపింగ్ ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తరహా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ త్వరలో ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.

అల్ట్రాటెక్ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ వి.కిషన్‌రావు, మహా సిమెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.జెమథయ్‌తో కలిసి ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ముందుగా అనుకున్నట్లు 16 రోజుల్లో కిలోమీటరు మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణాన్ని వైట్‌టాపింగ్ పద్ధతిలో పూర్తిచేశామని, ఈ విషయం తెలియజేస్తూ జీహెచ్‌ఎంసీకి లేఖ రాశామని తెలియజేశారు. 30 మంది ఇంజినీర్లతో కూడిన బృందం రేయింబవళ్లు పడిన కష్టానికి ఫలితం లభించిందన్నారు.

ప్రాజెక్టును సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఇంజినీర్లు, విద్యావేత్తలు సంతృప్తి వ్యక్తం చేశార న్నారు. ‘‘డెమో ప్రాజెక్టుకు మొత్తం రూ.2.25 కోట్లు ఖర్చయింది. ఒక్కో చదరపు మీటరుకు రూ.1,686 ఖర్చయింది. పెద్ద మొత్తంలో పనులు చేపడితే ఈ వ్యయాన్ని మరో 15 శాతం వరకు తగ్గించవచ్చు. నగరంతోపాటు, జిల్లా కేంద్రాలు, రహదారుల్లో ఈ పద్ధతి ద్వారా రోడ్డు నిర్మిస్తే గరిష్టంగా 30 ఏళ్ల వరకు మన్నిక ఉంటుంది’’ అని రవీందర్ రెడ్డి వివరించారు. అలా చేస్తే ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చు తప్పడంతోపాటు.. ఎన్నో సౌలభ్యాలుంటాయని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ఏడాది మొత్తం ఒకే ధరకు సిమెంట్ సరఫరా చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారాయన.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement