
పీఎన్‌బీ ఉద్యోగులు నీరవ్ మోదీ కంపెనీలకు అక్రమంగా లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్‌వోయూ)లు జారీ చేయడం, వీటిని ఆధారం చేసుకుని విదేశాల్లోని బ్యాంకు శాఖలు బయ్యర్స్ క్రెడిట్ (కొనుగోలు రుణాలు) ఇవ్వడం చేశాయి. వీటి విలువ సుమారు రూ.11,400 కోట్లు (1.77 బిలియన్ డాలర్లు) అని పీఎన్‌బీఐ స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.
అయితే, ఈ కేసులో ఇప్పుడు ఏంటి పరిష్కారం అన్న సందేహాలు రావచ్చు. మోదీ సంస్థలు పీఎన్‌బీకి బకాయి పడినంత చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. దీంతో పీఎన్‌బీ బయ్యర్స్ క్రెడిట్ ఇచ్చిన బ్యాంకులకు తిరిగి చెల్లింపులు చేస్తుంది. తనకు ఆరు నెలల సమయం ఇస్తే రూ.6,000 కోట్లు చెల్లిస్తానంటూ మోదీ ఇప్పటికే పీఎన్‌బీకి తెలిపినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే, మోదీ చెల్లించకపోతే?ఈ బాధ్యత ఎవరిది పీఎన్‌బీదా లేక ఎల్‌వోయూ ఆధారంగా రుణాలిచ్చిన బ్యాంకులదా...? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి.
ఎల్‌వోయూ: ఎల్‌వోయూ అన్నది ఓ దేశీయ బ్యాంకు తన ఖాతాదారుని తరఫున అంతర్జాతీయ లావాదేవీ నిర్వహించేందుకు ఇచ్చే అంగీకార పత్రం. దీన్ని సాధారణంగా వాణిజ్య రుణ పత్రంగా ఉపయోగిస్తుంటారు. రుణం తీసుకోవాలనుకున్న వ్యక్తి స్థానిక బ్యాంకును సంప్రదించి విదేశీ బ్యాంకు లేదా భారత బ్యాంకుకు చెందిన విదేశీ శాఖ పేరిట ఎల్‌వోయూ జారీ చేయాలని కోరొచ్చు. ఆ ఎల్‌వోయూ ఆధారంగా విదేశాల్లోని బ్యాంకు శాఖ బయ్యర్స్ క్రెడిట్ (వాణిజ్య రుణం/ కొనుగోలుకు రుణం)ను విడుదల చేస్తుంది. అప్పుడు ఆ మొత్తం స్థానిక బ్యాంకు నోస్ట్రో ఖాతాలో జమ అవుతుంది.
నోస్ట్రో అకౌంట్ అన్నది ఫారీన్ కరెన్సీ బ్యాంకు అకౌంట్. అప్పుడు రుణ గ్రహీత ఈ మొత్తాన్ని తన అవసరాలకు వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఆభరణాల కంపెనీలకు ఎల్‌వోయూపై ముడి వజ్రాల కొనుగోలు కోసం బ్యాంకులు స్వల్పకాలిక రుణాలు ఇస్తుంటాయి. ముడి వజ్రాన్ని సానబెట్టి దాన్ని తుది ఉత్పత్తిగా మార్చి ఎగుమతి చేసిన తర్వాత వచ్చే నిధులతో అంతర్జాతీయ బ్యాంకు శాఖకు చెల్లింపులు చేస్తాయి ఆభరణాల కంపెనీలు.
ఒకవేళ రుణ గ్రహీత విదేశీ బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే... ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత అతనికి ఎల్‌వోయూ జారీ చేసిన బ్యాంకుపైనే ఉంటుంది. చాలా కేసుల్లో ఖాతాదారులు 100 శాతం క్యాష్ మార్జిన్‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలో ఉంచితేనే బ్యాంకులు ఆ విలువకు సరిపడా ఎల్‌వోయూలను జారీ చేస్తుంటాయి. ఒకవేళ ఖాతాదారుడు చేతులెత్తేస్తే క్యాష్ మార్జిన్‌తో విదేశీ శాఖకు చెల్లింపులు చేస్తుంది.
పీఎన్‌బీపైనే బాధ్యత...: బ్యాంకర్ల అభిప్రాయం ప్రకారం ‘‘ సందిగ్ధత ఏమీ లేదు. వాస్తవ అంశాల ప్రకారం చూస్తే తుది బాధ్యత పీఎన్‌బీపైనే ఉంటుంది. పీఎన్‌బీ గ్యారంటీ ఆధారంగానే రుణం జారీ చేయడం జరిగింది. అంతేకాదు పీఎన్‌బీకి చెందిన నోస్ట్రో ఖాతా నుంచే ఆ రుణాన్ని పంపిణీ చేయడం కూడా జరిగింది’’ అని పేర్కొన్నారు.
పీఎన్‌బీ వాదన ఏమిటంటే విదేశీ బ్యాంకు శాఖలు ఆర్‌బీఐ మార్గదర్శకాలను సరిగా పట్టించుకోలేదని, నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణాన్ని తిరిగి 90 రోజుల్లోనే వసూలు చేసుకోవాల్సి ఉంటుందని పీఎన్‌బీ వాదన. మరి 2011 నుంచి ఎల్‌వోయూల ఆధారంగా రుణాల జారీ వ్యవహారం నడుస్తున్నట్టు పీఎన్‌బీ వెల్లడించిన నేపథ్యంలో ఇంతకాలం పాటు బయ్యర్స్ క్రెడిట్ ఇచ్చిన విదేశీ బ్యాంకు శాఖలు ఏం చేస్తున్నాయన్న సందేహం కూడా రాకమానదు.