టోకు ధరలూ...దిగొచ్చాయ్
న్యూఢిల్లీ: ధరాఘాతం నుంచి సామాన్యుడికి కాస్త ఉపశమనం లభిస్తోంది. తొమ్మిది నెలల తర్వాత తొలిసారిగా టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కీలకమైన 5 శాతం కిందికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4.68 శాతానికి తగ్గుముఖం పట్టింది. జనవరిలో ఈ రేటు 5.05 శాతంగా, క్రితం ఏడాది ఫిబ్రవరిలో 7.28 శాతంగా నమోదైంది. ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు భారీగా తగ్గడం ద్రవ్యోల్బణం శాంతించేందుకు దోహదం చేసింది. గతేడాది మే నెల(4.58%) తర్వాత మళ్లీ ఈ స్థాయిలో టోకు ధరల రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం కూడా ఫిబ్రవరిలో 25 నెలల కనిష్టానికి(8.1%) తగ్గడం తెలిసిందే. ధరల కట్టడి నేపథ్యంలో వచ్చే నెల 1న ఆర్‌బీఐ చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో పాలసీ వడీరేట్లను తగ్గించేందుకు అవకాశం ఉందన్న ఆశలు పెరుగుతున్నాయి.
ఆహార ధరలకు కళ్లెం...
ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారిన ఆహార ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది. జనవరిలో 8.8 శాతంగా ఉన్న ఈ రేటు ఫిబ్రవరిలో 8.12 శాతానికి తగ్గింది. పాలు, పండ్లు, బియ్యం మినహా దాదాపు అన్ని రకాల ఆహార వస్తువుల ధరలూ శాంతించడం గమనార్హం.
వార్షిక ప్రాతిపదికన... అంటే గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఇదే నెలలో ఉల్లిపాయల ధరలు 20.06% బంగాళాదుంపల ధరలు 8.36% తగ్గాయి.
మొత్తం కూరగాయల విభాగం ద్రవ్యోల్బణం ఏకంగా ఫిబ్రవరిలో 3.99 శాతానికి దిగొచ్చింది. జనవరిలో ఈ రేటు 16.6 శాతం కావడం గమనార్హం.
పప్పులు, తృణధాన్యాలు, గోధుమలు, పండ్లు, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ధరలు మాత్రం ఫిబ్రవరిలో ప్రియం అయ్యాయి.
వంటనూనెలు, చక్కెర ఇతరత్రా వస్తువులతో కూడిన తయారీ రంగ విభాగం ద్రవ్యోల్బణం రేటు జనవరిలో మాదిరిగానే 2.76 శాతంగా నమోదైంది.
ఇకనైనా వడ్డీరేట్లు తగ్గించాలి: కార్పొరేట్లు
రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు రెండూ భారీగా దిగొచ్చిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఇకనైనా వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామిక రంగం డిమాండ్ చేసింది. స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును మందగమనం నుంచి గాడిలోపెట్టాలంటే రేట్ల కోత తప్పనిసరి అని కార్పొరేట్లు పేర్కొన్నారు.
ఆనందంగా ఉంది
మొత్తంమీద ధరలు దిగొస్తుండటం ఆనందం కలిగిస్తోంది. అయితే ద్రవ్యోల్బణం ధోరణిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ధరలు శాంతించడం సంతృప్తి కలిగిస్తోంది. - పి. చిదంబరం, ఆర్థిక మంత్రి
శుభవార్త ఇది
ధరల పరిస్థితి అదుపులోకి రావడం నిజంగా శుభవార్తే. ఇప్పటిదాకా ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం... ఎట్టకేలకు సంతృప్తికరమైన స్థాయికి దిగిరావడం ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశం. - మాంటెక్ సింగ్, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్