ఐటీ దిగ్గజాలు.. చలో బైబ్యాక్!
ఈ నెల 20న బోర్డు సమావేశంలో టీసీఎస్ ప్రకటన..
• ఇన్ఫోసిస్, విప్రో కూడా ఇదే బాటలో...!
• భారీ నగదు నిల్వలను వాటాదారులకు పంచాలన్న డిమాండ్ల నేపథ్యం
• ఇటీవలే 340 కోట్ల డాలర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించిన కాగ్నిజంట్
న్యూఢిల్లీ: కుప్పలుతెప్పలుగా నగదు నిల్వలతో తులతూగుతున్న ఐటీ దిగ్గజాలు... ఇన్వెస్టర్లను శాంతింపజేసేందుకు సిద్ధమవుతున్నాయి. పోటాపోటీగా షేర్ల బైబ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. దేశీ ఐటీ అగ్రగామి టీసీఎస్ గురువారం బైబ్యాక్ ప్రతిపాదనను బయటపెట్టింది. ఇక ఇన్ఫోసిస్ కూడా దీనికోసం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. ఇటీవల కాగ్నిజంట్ టెక్నాలజీస్ 340 కోట్ల డాలర్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే. కొద్దినెలల క్రితం రూ. 2500 కోట్ల విలువైన బైబ్యాక్‌ను ప్రకటించిన ఐటీ దిగ్గజం విప్రో నుంచి కూడా మరో బైబ్యాక్ వుండవచ్చని మార్కెట్లో అంచనాలు మొదలయ్యాయి. ఇక భారీగా నగదు నిల్వలు ఉన్న మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
20న టీసీఎస్ బోర్డు సమావేశం...
షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 20న డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుందని టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ఎంతమొత్తాన్ని వెచ్చించనున్నదీ, ఎన్ని షేర్లను బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. దీనిపై బోర్డు సమావేశం తర్వాత ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిర్ధిష్టమైన డివిడెండ్ పాలసీతో పాటు కంపెనీ వద్దనున్న నగదు పంపిణీ కోసం షేర్ల బైబ్యాక్‌పై దృష్టిపెట్టా ల్సిందిగా ఇన్వెస్టర్ల నుంచి సూచనలు వస్తున్నాయంటూ టీసీఎస్ సీఈఓ ఎన్.చంద్రశేఖరన్ కూడా వెల్లడించారు.
దీనిపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. కాగా, గడిచిన కొన్నేళ్లుగా తమ కంపెనీ వాటాదారులకు డివిడెండ్ చెల్లింపులను పెంచుతూనే వస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 2016 డిసెంబర్ నాటికి టీసీఎస్ వద్ద రూ.43,169 కోట్ల విలువైన నగదు నిల్వలు ఉన్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న టీసీఎస్ షేరు.. గురువారం బీఎస్‌ఈలో 1.3% లాభపడి రూ.2,447 వద్ద ముగిసింది. ఇక ఇన్ఫోసిస్ షేరు కూడా 3% ఎగబాకి రూ.1,012 వద్ద స్థిరపడింది.
ఇన్ఫీపై ఒత్తిడి...
వేతన ప్యాకేజీల విషయంలో వ్యవస్థాపకులకు, డైరెక్టర్ల బోర్డుకు మధ్య తీవ్ర విభేదాలు వెలుగుచూసిన ఇన్ఫోసిస్‌లోనూ చాన్నాళ్లుగా బైబ్యాక్ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్ఫీలో కార్పొరేట్ నైతిక ప్రమాణాలు దిగజారాయంటూ స్వయంగా కీలక వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో, కంపెనీ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని విషయాల్లో బోర్డుకు, వ్యవస్థాపకులకు అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ... కార్పొరేట్ గవర్నెన్స్‌లో లోపాలు మాత్రం లేవంటూ ఇన్ఫీ చైర్మన్ శేషసాయి, కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా తాజాగా విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగలేదు.
మరోపక్క, కంపెనీ మాజీ సీఎఫ్‌ఓలు మోహన్‌దాస్ పాయ్, వి. బాలకృష్ణన్‌లు ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాల్సిందేనంటూ మరోసారి తాజాగా గళం విప్పారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడం, వారికి మరింత విలువను చేకూర్చడానికి ఈ చర్యలు తప్పనిసరి అని కూడా వారు చెబుతున్నారు. నిధుల కేటాయింపులపైనా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.. 2014లో ఇన్ఫోసిస్ సీఈఓగా విశాల్ సిక్కా బాధ్యతలు చేపట్టినప్పుడు(తొలి ప్రమోటర్‌యేతర సీఈఓగా) పాయ్, బాలకృష్ణన్‌లు ఇద్దరూ కంపెనీ 180 కోట్ల డాలర్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం ఇన్ఫోసిస్ వద్ద సుమారు(2016 డిసెంబర్ నాటికి) రూ.35,697 కోట్ల(525 కోట్ల డాలర్లు) నగదు నిల్వలు ఉన్నాయి. రూ.12,000 కోట్ల విలువైన షేర్లను ఇన్ఫోసిస్ బైబ్యాక్ రూపంలో కొనుగోలు చేయొచ్చని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.2.32,428 కోట్లుగా ఉంది. దీని ప్రకారం చూస్తే బైబ్యాక్ పరిమాణం ఈక్విటీ క్యాపిటల్లో 5 శాతం ఉంటుందని అంచనా.
మేం వ్యతిరేకం కాదు ఇన్ఫీ సీఓఓ ప్రవీణ్ రావు
ఇన్పోసిస్ నుంచి కూడా బైబ్యాక్ విషయంలో సంకేతాలు వెలువడ్డాయి. బైబ్యాక్‌కు తాము(కంపెనీ బోర్డు) వ్యతిరేకం కాదని ఇన్ఫీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ప్రవీణ్ రావు గురువారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. గడిచిన నాలుగేళ్లుగా తాము డివిడెండ్ చెల్లింపులను పెంచుతూ వస్తున్నామని... తగిన సమయంలో బైబ్యాక్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘వాటాదారుల నుంచి బైబ్యాక్ డిమాండ్‌లు సమంజసమే. అయితే, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరుచుకోవడం, వాటాదారులను సంతోషపెట్టడం మధ్య సమతుల్యతను సాధించే విషయంలో కంపెనీ వద్దనున్న నగదు నిల్వలను ఎలా వినియోగించుకోవాలన్న కీలకమైన బాధ్యత బోర్డుపైనే ఉంటుంది’ అని రావు వ్యాఖ్యానించారు. ఇన్ఫీ గనుక బైబ్యాక్‌ను ప్రకటిస్తే.. 35 ఏళ్ల కంపెనీ చరిత్రలో మొట్టమొదటిసారి అవుతుంది.
ఎందుకు ప్రకటిస్తున్నాయంటే...
దేశీ ఐటీ కంపెనీల వద్ద ఇప్పుడు భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి. కంపెనీలు నిరుపయోగంగా ఇంత పెద్దమొత్తంలో నగదును అట్టిపెట్టుకుంటూ.. తమకు మాత్రం ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చడం లేదని ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా విదేశీ ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ 340 కోట్ల డాలర్ల షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించడంతో దేశీ ఐటీ కంపెనీలపై మరింత ఒత్తిడి పెరిగింది.
మరోపక్క, ఐటీ కంపెనీలు తమ వద్దనున్న నగదు నిల్వలను అవసరం లేకున్నా కంపెనీల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నాయంటూ(ఇన్ఫోసిస్‌పై మాజీ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి) ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా బైబ్యాక్ ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలాఉండగా.. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక వీసా నిబంధనలు కఠినతరం అవుతుండటం... యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) నేపథ్యంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా దేశీ ఐటీ కంపెనీల షేర్లు దిగజారుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందించడం, షేరు ధరకు ఊతం ఇచ్చేందుకు కూడా బైబ్యాక్ ఆఫర్లపై కంపెనీలు దృష్టిసారిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
బైబ్యాక్ సంగతి ఇదీ..
ఒక కంపెనీ జారీ చేసిన ఈక్విటీ షేర్లను మార్కెట్లో లేదా ఓపెన్ టెండర్ ద్వారా తిరిగి కొనుగోలు చేయడాన్నే బైబ్యాక్‌గా వ్యవహరిస్తారు. బైబ్యాక్ చేపట్టడానికి పలు కారణాలు వుంటాయి. షేరు ధర ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం, మిగులు నగదును ఖర్చుచేయడం ద్వారా ఈక్విటీని తగ్గించడం, ఇన్వెస్టర్లకు నగదును పంచడం వంటి అంశాలే కాకుండా పన్ను లాభాల్ని పొందడానికి కూడా ప్రమోటర్లు ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటుంటారు.
తర్వాత వ్యాపార అవకాశాలు సన్నగిల్లడం, వృద్ధి మందగించడం వంటి సందర్భాల్లో నిరుపయోగంగా ఉన్న నిధులను బైబ్యాక్ రూపంలో ఖర్చు చేస్తాయి. దీనివల్ల కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్(షేర్లు) తగ్గి.. షేరు వారీ ఆర్జన(ఈపీఎస్) పెరుగుతుంది. ఓపెన్ టెండర్ లేదా మార్కెట్ బైబ్యాక్ ఈ రెండు పద్ధతుల్లో షేర్లను తిరిగి కొనుగోలు చేస్తారు. బైబ్యాక్‌కు నిర్ధిష్ట వ్యవధి, ప్రస్తుత ధరపై ఎంతవరకు అధికంగా చెల్లించాలి(ప్రీమియం) అనేది కంపెనీ బోర్డు నిర్ణయిస్తుంది. ఓపెన్ టెండర్ ద్వారా అయితే, బిడ్డింగ్ ద్వారా ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదే మార్కెట్ బైబ్యాక్ పద్ధతిలో మాత్రం ప్రకటించిన మేరకు బైబ్యాక్‌ను పూర్తి చేయాలన్న నిబంధనేమీ లేదు.