వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాల పొడిగింపుపై ట్రంప్ కార్యాలయం తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనల విషయంలో సొంత చట్టసభ్యుల నుంచే ఎదురుదెబ్బ తగులుతోంది. కొంతమంది టాప్ అమెరికా చట్టసభ్యులు, న్యాయవాద గ్రూప్‌లు ఈ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఐదు లక్షల నుంచి ఏడున్నర లక్షల మంది భారతీయులను తిరిగి వారి స్వదేశానికి పంపించేలా ఉన్న ఈ నిబంధనలు, అమెరికా టాలెంట్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయని పేర్కొంటున్నారు. అంతేకాక భారత్‌తో ఉన్న సంబంధాలు దెబ్బతిన్ననున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ''బై అమెరికన్, హైర్ అమెరికన్'' కార్యక్రమంలో భాగంగా... డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ హెచ్-1బీ వీసాల పొడిగింపు విషయంలో కఠినతరమైన నిబంధనలను ప్రతిపాదించారు. గ్రీన్‌కార్డ్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్-1బీ వీసాను పొడిగించవద్దని సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీంతో భారీ మొత్తంలో భారతీయులను స్వదేశాలకు పంపించేయాలని చూస్తోంది.
హెచ్-1బీ వీసా హోల్డర్లపై ఈ క్రూరమైన ఆంక్షలను వల్ల వారి కుటుంబాలు ముక్కముక్కలుగా విడిపోతాయని, తమ సమాజంలో టాలెంట్ దెబ్బతిన్ననుందని, దీంతో ఎంతో ముఖ్యమైన భాగస్వామిగా ఉంటున్న భారత్‌తో తమకున్న సంబంధాలు దెబ్బతింటాయని డెమొక్రాటిక్ కాంగ్రెస్‌ఉమెన్ తులసి గబ్బార్డ్ అన్నారు. ఈ నిబంధనలు ప్రభావం చూపనున్న భారతీయుల్లో ఎక్కువగా చిన్న వ్యాపారాల యజమానులు, ఉద్యోగవకాశాలు కల్పించేవారే ఉన్నారు. వీరు అమెరికా ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. కానీ ఈ నిబంధనలతో గ్లోబల్ 21వ శతాబ్దపు ఆర్థికవ్యవస్థలతో పోటీపడే తమ సామర్థ్యం పడిపోతుందని ఆమె పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ వెంటనే ఈ ప్రతిపాదనను నిరాకరించాలని ఆశిస్తున్నామని ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజ క్రిష్ణమూర్తి చెప్పారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి వారెందరో ఇక్కడకు ముందు హెచ్–1బీ వీసాల మీద వచ్చిన వారేననీ, వలసదారులు లేకుండా అమెరికా ఎలా గొప్పగా అవుతుందని భారత సంతతికి చెందిన మరో కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ ఖన్నా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment