హెచ్1బీపై ట్రంప్ దూకుడు
సంస్కరణలకు వ్యూహాలు రచిస్తున్న అమెరికా సర్కారు
► వీసా సంస్కరణలపై కాంగ్రెస్‌లో ఇప్పటికే ఆరు బిల్లులు
వాషింగ్టన్ : భారత ఇంజనీర్లు, కంపెనీలపై పెను ప్రభావం చూపే హెచ్1బీ వీసాల సం స్కరణలపై ట్రంప్ సర్కారు సీరియస్‌గా ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చాక చేసిన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో దూకుడు మీదున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీలైనంత త్వరగా హెచ్1బీ వీసాల చట్టానికి మార్పులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు.
అమెరికన్ల ఉద్యోగాలను భారత ఐటీ కంపెనీలు కొల్లగొడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో హెచ్1బీ వీసాల చట్ట సవరణకోసం ఇప్పటికే ఆరుకుపైగా బిల్లులు అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులన్నింటి లక్ష్యం.. యూఎస్‌లోని భారత కంపెనీల్లో అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలనటమే. కాగా, అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొడుతున్నారన్న వాదనను పరిశోధక విద్యార్థులు, ఆర్థికవేత్తలు, సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌లు ఖండిస్తున్నారు.
వలసలకు చెక్?: హెచ్1బీ వర్క్ వీసాలు కలిగిన వారిలో అధికంగా భారత ఐటీ ఉద్యోగులు, కంపెనీలే ఉన్నాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోపే రిపబ్లికన్ సెనెటర్ చక్ గ్రాస్లీ మరో సెనేటర్‌తో కలిసి ‘హెచ్1బీ, ఎల్1 సంస్కరణ చట్టం’ను ప్రవేశపెట్టారు. సెనేట్ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ కూడా అయిన గ్రాస్లీ.. నిపుణులు, అమెరికా కార్మికులకు ప్రయోజనం చేకూరేలా వీసాల జారీలో మార్పులు చేసే ఉద్దేశంతో దీన్ని తెరపైకి తెచ్చారు.
అమెరికా ఉద్యోగుల స్థానంలో హెచ్1బీ, ఎల్1 వీసాదారులను తీసుకోవడాన్ని నిషేధించటం, ఈ వీసాలపై అమెరికా వచ్చిన నిపుణుల కనీస వేతనాలను రెట్టింపు చేయాలన్న నిబంధన సిలికాన్ వ్యాలీలోని అధిక శాతం భారతీయ కంపెనీలపై ప్రభావం చూపనుంది. గత నెలలో సెనేటర్ షెరాడ్ బ్రౌన్ తదితరులు అవుట్‌సోర్సింగ్‌ను నియంత్రించే బిల్లును ప్రవేశపెట్టారు. ఫిబ్రవరిలో రిపబ్లికన్ సెనేటర్లు టామ్ కాటన్ , డేవిడ్ పరడ్య... సుస్థిరమైన ఉద్యోగాల కోసం అమెరికన్ వలసల సంస్కరణ (రైజ్) చట్టం ప్రవేశపెట్టారు. మరోవైపు, హెచ్1బీ వీసాలతోపాటుగా గ్రీన్ కార్డు జారీ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అర్కాన్సాస్ రిపబ్లికన్ సెనేటర్ టామ్ కాటన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసి సూచించారు.
భారత్‌కు నష్టం తాత్కాలికమే!
ప్రీమియం (ఫాస్ట్ ట్రాక్) హెచ్1బీ వీసాల ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దుచేయాలన్న అమెరికా ప్రభుత్వ నిర్ణయం భారత అమెరికన్లకు తాత్కాలిక నష్టమేనని ప్రపంచబ్యాంకు మాజీ ఆర్థిక వేత్త కౌశిక్ బసు అభిప్రాయపడ్డారు. ‘హెచ్1బీ వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం భారత్‌కు కాస్త ఇబ్బందికరమే అయినా తర్వాత మేలు జరుగుతుంది. కానీ అమెరికాకు మాత్రం తీవ్ర నష్టం కలిగిస్తుంది’ అని కౌశిక్ బసు ట్వీటర్లో పేర్కొన్నారు.
వీసాల సంస్కరణల్లో ఔట్‌సోర్సింగ్‌ను నియంత్రించాలన్న నిబంధన ఆచరణ సాధ్యం కాదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అమెరికా హెడ్ రాధిక బాత్రా చెప్పారు. ఇది ఉత్పత్తి, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం 2020 నాటికి యూఎస్‌లో పదిలక్షల మంది సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. దేశ ఆర్థిక, సాంకేతిక రంగంపై ప్రతికూల ప్రభావం తప్పదని నిపుణులు భావిస్తున్నారు.
అక్రమ వలసలను అడ్డుకునేందుకే!
అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడమే అమెరికా లక్ష్యం తప్ప, హెచ్1బీ వీసాల్ని అడ్డుకోవడం కాదని ఆ దేశ సీనియర్ అధికారులు భారత్‌కు స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. హెచ్1బీ వీసాలపై భారత నిపుణుల్లో నెలకొన్న ఆందోళనల్ని తగ్గించే క్రమంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే గురువారం విలేకరులతో మాట్లాడారు.
హెచ్1బీ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. భారతీయుల నైపుణ్యంపై అమెరికాలో బలమైన గుర్తింపు, గౌరవం ఉన్నాయని.. అలాగే అమెరికా ఆర్థిక రంగానికి భారత్ సాంకేతిక నిపుణులు సాయం చేస్తున్నారన్న అభిప్రాయం అక్కడి ఉన్నతాధికారులతో చర్చల్లో వ్యక్తమైందన్నారు. హెచ్1బీ వీసాల జారీ వాణిజ్య, వ్యాపార, ఆర్థిక అంశమని అమెరికాకు స్పష్టం చేశామని గోపాల్ తెలిపారు.