సాక్షి, ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : వివేక్ దహియా, హెచ్‌పీలో సీనియర్ ప్రోగ్రామర్, వార్షిక వేతనం 1.40 లక్షల డాలర్లు.. రాజ్ రంగసామి, ఇంటెల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, వార్షిక వేతనం 1.35 లక్షల డాలర్లు... ఇద్దరూ గడచిన ఎనిమిది సంవత్సరాలుగా అమెరికాలో ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. మొదటిసారి హెచ్1బీ వచ్చినప్పుడు మూడేళ్లు, ఆ తర్వాత కాలంలో మరో మూడేళ్లు వీసా రెన్యువల్ అయింది. మూడోసారి హెచ్1బీ వీసా గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేశారు. అనేక లొసుగులు ఎత్తిచూపుతూ యునైటెడ్ స్టేట్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) నోటీసులు జారీ చేసింది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఏ ఇబ్బంది లేకుండా వారు ఉద్యోగం చేశారు. చివరికి 210 రోజుల తర్వాత మరో ఏడాది పాటు హెచ్1బీ రెన్యువల్ అయ్యింది!!
కానీ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఐటీ ఉద్యోగులకు ఇలాంటి ఏ వెసులుబాటూ ఉండదు. అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం వీసా పొడిగింపునకు వచ్చిన దరఖాస్తు సక్రమంగా ఉందని ఇమ్మిగ్రేషన్ అధికారి భావిస్తేనే ఆమోదిస్తారు. లేదంటే తిరస్కరణ తప్పదు. గతంలో మాదిరి నోటీసుల జారీ ఉండదు. అంతేకాదు వీసా పొడిగింపు దరఖాస్తు తిరస్కరించిన వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు (ఎన్‌టీఏ) జారీ చేస్తారు. అప్పటికీ వెళ్లకపోతే పదేళ్ల పాటు అమెరికా రాకుండా బహిష్కరిస్తారు. వీసా పొడిగింపు దరఖాస్తులో ఏ లోపాలు లేకపోయినా ఇమ్మిగ్రేషన్ విభాగం తిరస్కరించిందని ఒకవేళ దరఖాస్తుదారుడు భావిస్తే అటార్నీ ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు. అయితే గతంలో మాదిరి ఆ సమయంలో దరఖాస్తుదారుడు ఉద్యోగం చేయడానికి అర్హుడు కాడు.
అప్పీల్ పరిష్కారమయ్యే వరకు గరిష్టంగా 240 రోజులు అమెరికాలో ఉండవచ్చు. అప్పటికీ దరఖాస్తులో మార్పు లేకపోతే తక్షణమే ఎన్‌టీఏ జారీ చేస్తారు. అప్పుడు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. హెచ్1బీ వర్క్ వీసా కింద పని చేస్తూ పొడిగింపు అనుమతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగికి ఇమ్మిగ్రేషన్ విభాగం కారణం చెప్పకుండా ఎన్‌టీఏ జారీ చేసి.. అతడిని ఉద్యోగం నుంచి తప్పించాలని కంపెనీని ఆదేశించే భయంకరమైన నిబంధనను ఇటీవల యూఎస్‌సీఐఎస్ అమల్లోకి తెచ్చింది. ‘‘ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలకు ఇవన్నీ ఇబ్బందికరంగా పరిణమించాయి. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చెప్పలేకపోతున్నాం’’అని నాస్కామ్ ఉపాధ్యక్షుడు శివేంద్ర సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. యూఎస్‌సీఐఎస్ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఉద్యోగి విధులు నిర్వహించడానికి వీల్లేదన్న నిబంధనల భారత ఐటీ పరిశ్రమకు పెద్ద సవాల్ వంటిదని ఆయన అన్నారు.
దేశీయ ఐటీకి ఇబ్బందే
అమెరికా ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త నిబంధనల కారణంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది ఈ కంపెనీలకు జారీ చేసిన వర్క్ పర్మిట్ వీసాలు కేవలం 12 శాతం. అదే అమెరికన్ కంపెనీల విషయంలో పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో వారు లబ్ధి పొందుతున్నారు. పెద్ద ఎత్తున ఆర్డర్లు చేతిలో ఉన్నా భారతీయ కంపెనీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇదే విషయాన్ని నాస్కామ్ చైర్ పర్సన్ దేబయాని ఘోష్ ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకువెళ్లారు. విచిత్రమేమిటంటే అమెరికాలో ఇప్పటికప్పుడు టెక్నాలజీ రంగంలో 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కాకపోతే నిపుణులైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు (అమెరికా జాతీయులు) దొరక్క టెక్నాలజీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని నాస్కామ్ పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన తర్వాత భారత ఐటీ కంపెనీలు నిపుణులైన అమెరికా జాతీయుల కోసం వందల విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అయినా ఫలితం లేకపోయిందని, ఉద్యోగాల్లో చేరిన తర్వాత 67 శాతం మంది మొదటి ఆరు మాసాల్లోనే మానేస్తున్నారని, అందుకు కారణం వారిలో నైపుణ్యం లేకపోవడమేనని టీసీఎస్ ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ వివరించారు. ప్రస్తుత పరిణామాలు రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
నాస్కామ్ కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంది. ‘‘హెచ్1 బీ వర్క్ వీసా నిబంధనల్లో తీసుకువచ్చిన మార్పులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. కొత్త నిబంధనల వల్ల అమెరికాలో ఐటీ కంపెనీలు విదేశీ నిపుణుల్ని ఉద్యోగాల్లోకి తీసుకోవడం సంక్లిష్టమైపోతుంది. అమెరికా నిపుణుల కొరతను ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇలాంటి నిబంధనలతో నిపుణులైన విదేశీయులు ఉద్యోగాల్లో కొనసాగడం తగ్గిపోతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న విదేశీ నిపుణులు తగ్గిపోవడం వల్ల ఎదురయ్యే ప్రభావాన్ని ఆ దేశం అంచనా వేయలేకపోతోంది’’అని నాస్కామ్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment