విప్రో లాభం 2,085 కోట్లు | Wipro Q2 Net up 7.9% at `2084.8 crore | Sakshi
Sakshi News home page

విప్రో లాభం 2,085 కోట్లు

Published Thu, Oct 23 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

విప్రో లాభం 2,085 కోట్లు

విప్రో లాభం 2,085 కోట్లు

అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు వ్యాపార వృద్ధిపై అత్యంత విశ్వాసంతో ఉన్నాయి. దీంతో ఐటీ క్లయింట్లు టెక్నాలజీ వినియోగంపై భారీగా పెట్టుబడులు వెచ్చించేందుకు ముందుకొస్తున్నారు. మరోపక్క, దేశీయంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధిని గాడిలోపెట్టేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా కార్పొరేట్ రంగంలో విశ్వాసం పెంచుతోంది.         
- అజీమ్ ప్రేమ్‌జీ, విప్రో చైర్మన్

 
క్యూ2లో 7.9% వార్షిక వృద్ధి
ఆదాయం 7.5 శాతం అప్; రూ.11,816 కోట్లు

బెంగళూరు: దేశీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో రూ.2,085 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,932 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.9 శాతం వృద్ధి నమోదైంది. ఇన్‌ఫ్రా సేవల విభాగంలో మెరుగైన పనితీరు ఇందుకు తోడ్పడిందని కంపెనీ పేర్కొంది. కాగా, క్యూ2లో మొత్తం ఆదాయం 7.5 శాతం ఎగబాకి రూ.11,816 కోట్లకు చేరింది. గతేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో ఆదాయం రూ.10,991 కోట్లుగా ఉంది. కాగా, సీక్వెన్షియల్‌గా చూస్తే(ఈ ఏడాది ఏప్రిల్-జూన్, క్యూ1లో రూ.2,103 కోట్లతో పోలిస్తే) నికర లాభం దాదాపు 1 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం త్రైమాసిక ప్రాతిపదికన 5 శాతం పెరగడం గమనార్హం.
 
గెడైన్స్‌కు అనుగుణంగానే సాఫ్ట్‌వేర్ ఆదాయం...
ఐటీ సేవల ఆదాయం సెప్టెంబర్ క్వార్టర్‌లో 1.77 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 8.6 శాతం, ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే 1.8 శాతం చొప్పున పెరిగింది. కంపెనీ జూలైలో పేర్కొన్న ఆదాయ అంచనా(గెడైన్స్) 1.77-1.81 బిలియన్ డాలర్ల స్థాయిలోనే క్యూ2 గణాంకాలు నమోదయ్యాయి. అయితే, మార్కెట్ విశ్లేషకుల అంచనా 1.78 బిలియన్ డాలర్ల కంటే కొద్దిగా తక్కువగా ఆదాయం ప్రకటించింది. కాగా, ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో ఐటీ సేవల ఆదాయం 1.80-1.84 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది.

ఈ ఏడాది(2014-15) ప్రథమార్ధం కంటే ద్వితీయార్థం ఐటీ పరిశ్రమకు చాలా సానుకూలంగా ఉంటుందని విప్రో సీఈఓ టీకే కురియన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీకి డిమాండ్ స్థిరంగా కొనసాగుతోందని.. ప్రధానంగా ఉత్తర అమెరికాలో వ్యయాలు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు. యూరప్‌లో కూడా అవుట్‌సోర్సింగ్ వృద్ధి అవకాశాలు జోరందుకుంటున్నాయని కురియన్ తెలిపారు.
 
ఇతర ముఖ్యాంశాలు...
సెప్టెంబర్ చివరినాటికి ఐటీ సేవల విభాగం మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,54,297కు చేరింది.
ఐటీ ఉత్పత్తుల విభాగం ఆదాయం క్యూ2లో రూ.920 కోట్లుగా నమోదైంది.
జూలై-సెప్టెంబర్ మూడు నెలల వ్యవధిలో 50 మంది కొత్త క్లయింట్లను కంపెనీ దక్కించుకుంది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం విప్రో షేరు ధర బుధవారం 1.47 శాతం లాభంతో రూ.582 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement